కర్ణాటకలో జరుగుతున్న సామాజిక, విద్యా సర్వే ( జనాలు దీన్నే ‘కులం సర్వే’ అంటున్నారు) లో పాల్గొనడానికి రాజ్యసభ సభ్యురాలు, ప్రముఖ దాత సుధా మూర్తి కుటుంబం నిరాకరించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, ఆమె భర్త నారాయణ మూర్తి కూడా ఈ సర్వేకు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. తాము ఏ వెనుకబడిన వర్గానికి చెందనందున, ఈ సర్వేలో పాల్గొనడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఈ దంపతులు స్పష్టం చేశారు.
సుధా మూర్తి కుటుంబం ఈ సర్వేలో పాల్గొనడానికి నిరాకరిస్తూ ఒక స్వీయ ప్రకటన పత్రాన్ని అందజేసింది. కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (KSCBC) నిర్వహిస్తున్న ఈ సర్వేలో సమాచారం ఇవ్వకపోవడానికి ఆమె “వ్యక్తిగత కారణాలను” కూడా తెలిపారు. ఆమె తీసుకున్న ఈ వైఖరి ఇప్పుడు రాష్ట్రంలో చర్చకు దారితీసింది. సుధా మూర్తి వైఖరిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు.
“సర్వేలో పాల్గొనాలని ఎవరినీ బలవంతం చేయలేము. ఇది స్వచ్ఛందంగా జరగాలి” అని అన్నారు. సర్వే మొదలైన కొద్ది రోజులకే కర్ణాటక హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఈ సర్వేలో పాల్గొనడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం అని తేలింది. సర్వేలో పాల్గొనడానికి ఎవరినీ ఒత్తిడి చేయకూడదని, ప్రజలకు ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా, సేకరించిన డేటా గోప్యంగా ఉంచాలని, ఎవరికీ బహిర్గతం చేయబడదని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ హామీ తర్వాత కూడా మూర్తి కుటుంబం నిరాకరించడం గమనార్హం.
ఈ సర్వే హ్యాండ్‌బుక్‌లో ఉన్న కులాల జాబితా కేవలం అధికారుల అంతర్గత వినియోగం కోసమే తప్ప, దానికి ఎలాంటి చట్టపరమైన విలువ లేదని వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ మధుసూదన్ ఆర్ నాయక్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. కేవలం అక్షర క్రమంలో కులాలను గుర్తించడానికి మాత్రమే ఆ జాబితా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. రూ. 420 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ఈ సర్వే సెప్టెంబర్ 22న ప్రారంభమైంది. ఇంటింటికి వెళ్లి దాదాపు 60 ప్రశ్నలకు సమాచారం సేకరిస్తున్నారు. అయితే, తాము వెనుకబడిన వర్గానికి చెందిన వాళ్లం కానందున, ఈ సర్వేకు సహకరించాల్సిన అవసరం లేదనే వాదనను సుధా మూర్తి కుటుంబం గట్టిగా చెప్పింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates