ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేసేటపుడు.. ఆ విమర్శల్లో లాజిక్ ఎంతమేర ఉంది అని చూసుకోవడం కీలకం. ఒక స్టాండ్‌కు కట్టుబడి విమర్శలు చేస్తే.. అవి సహేతుకంగా అనిపిస్తేనే జనం నుంచి మద్దతు లభిస్తుంది. ఆ ఇష్యూలో ప్రతిపక్షానికి మైలేజీ వస్తుంది. కానీ ప్రతి విషయాన్ని రాజకీయం చేద్దామని, ప్రభుత్వం మీద బురదజల్లుదామని చేసే ప్రయత్నాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు బొక్క బోర్లా పడుతోంది.
విశాఖపట్నానికి ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ రావడం మీద వైసీపీ రాజకీయం ఇలాగే ఉంది. 80 వేల కోట్లకు పైగా పెట్టుబడితో గూగుల్.. ఈ డేటా సెంటర్, ఏఐ హబ్‌లను ఏర్పాటు చేస్తుండడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఢిల్లీలో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ భారీ పెట్టుబడుల గురించి దేశానికి తెలియజేసింది. దీంతో కూటమి ప్రభుత్వం మీద సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. జనాల్లో కూడా ఈ విషయంలో ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.
మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి భారీ పెట్టుబడులు వచ్చినపుడు ప్రతిపక్షాలు కూడా హర్షం వ్యక్తం చేస్తాయి. లేదంటే సైలెంటుగా ఉంటాయి. కానీ వైసీపీ మాత్రం ఈ విషయం మీద రాజకీయం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తోంది. గూగుల్ డేటా సెంటర్ల వల్ల అసలు ప్రయోజనమే లేదని.. దీని ద్వారా వచ్చేవి కేవలం 200 ఉద్యోగాలని.. వేరే దేశాల నుంచి జనాల వ్యతిరేకతను తట్టుకోలేక ఇండియాను వేదికగా ఎంచుకున్నారని.. డేటా సెంటర్లకు నీళ్లు భారీగా అవసరం పడతాయని.. దీని వల్ల వైజాగ్‌లో నీటి సమస్య తలెత్తుతుందని.. విద్యుత్ వినియోగం పెరిగి జనం మీద భారం పడుతుందని.. ఇలా అనేక ప్రతికూలతలను చూపించి ఇదొక వేస్ట్ వ్యవహారం అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు. గూగుల్‌కు రాయితీలు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు.
ఐతే దీనికి కూటమి భాగస్వామ్య పార్టీలు దీటుగానే బదులిస్తున్నాయి. ఐతే గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్‌ల విషయంలో విమర్శలు చేస్తున్న వైసీపీ వాళ్లు.. ఆ స్టాండ్‌కే కట్టుబడి అయినా ఉండాలి. కానీ అదే సమయంలో విశాఖకు ఈ పెట్టుబడి రావడంలో క్రెడిట్ అంతా జగన్‌కు కట్టబెట్టాలని చూస్తున్నారు. జగన్ హయాంలో అదాని వైజాగ్‌లో డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వచ్చాడని.. ఇప్పుడు గూగుల్‌తో అదానీ అసోసియేట్ అవుతున్నాడు కాబట్టి ఈ భారీ పెట్టుబడి తాలూకు క్రెడిట్ కూడా జగన్‌దే అని వాదిస్తున్నారు. ఓవైపు డేటా సెంటర్లతో ప్రయోజనం లేదని, అంతా నాశనం అని వాదిస్తూ.. ఇంకోపక్క వీటి క్రెడిట్‌ను జగన్‌కు కట్టబెట్టడానికి తాపత్రయ పడడం ఏం లాజిక్?
Gulte Telugu Telugu Political and Movie News Updates