ఇవి పాలిటిక్స్‌: సినిమా చేసినంత ఈజీకాదు స‌ర్‌!

సినీ పరిశ్రమకు రాజకీయ రంగానికి మధ్య అవినాభావ సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనేకమంది సినిమా హీరోలు నటులు రాజకీయాల్లోకి వచ్చారు. కొందరు గెలిచినవారు ఉన్నారు. ఓడిన వారు కూడా ఉన్నారు. సినీ పరిశ్రమలో ఉన్న ఇమేజ్‌ను వినియోగించుకుని రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన వారు కొందరైతే మరింత ఇమేజ్‌ను పెంచుకోవడంతో పాటు అధికారం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా కొందరు కనిపిస్తారు.

అయితే ఇటీవల కాలంలో సినీ ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పలువురు కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారుతుంది. సినిమా రంగంలో ఉంటే కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ అవకాశం పెద్దగా ఉండదు. ఉన్నా అది దొడ్డిదారిలోనే ఉంటుందన్న విషయం బహిరంగ రహస్యం. రాజకీయంగా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అదే విధంగా ఇతర పదవుల్లో ఉంటే ఆయా పదవులకు సంబంధించిన మేరకు జీతభత్యాలు వ‌స్తాయి. అంతకుమించి పై ఆదాయం అంటూ ఏదీ ఉండదు.

ఈ క్రమంలో కొంతమంది సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఇమడలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా కేరళకు చెందిన సీనియర్ నటుడు, ప్రస్తుతం త్రిసూర్ నియోజకవర్గ నుంచి ఎంపీగా అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న సురేష్ గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయ‌న‌ పెట్రోలియం శాఖకు సహాయ మంత్రిగా ఉన్నారు. బిజెపి తరఫున కేరళ నుంచి గెలిచిన తొలి ఎంపీ కూడా ఆయనే కావడం విశేషం. అయితే, ఆయన తాను సినిమా రంగాన్ని వదిలిపెట్టి వచ్చి తీవ్రంగా నష్టపోయానని మంత్రిగా ఉన్నప్పటికీ తనకు ఎలాంటి ఆదాయం లేదని వ్యాఖ్యానించారు.

అంతేకాదు తను మంత్రి పదవిని కూడా ఇప్పుడు వదిలేసి తిరిగి మళ్ళీ సినిమాల్లోకి వెళ్లాలని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. నిజానికి ఒక ఎంపీగా మూడు లక్షల రూపాయల దాకా వేతనం వస్తుంది. ఇతర భ‌త్యాలు వస్తాయి. ఒక కారు డ్రైవరు, ఇంటి అద్దె ఇలా కొన్ని అలవెన్సులు కూడా ఉంటాయి. అయినప్పటికీ సురేష్ గోపి తీవ్ర ఆవేదన వ్యక్తం చేయటం, ఆదాయం సరిపోవడం లేదని చెప్పటం విశేషం. అయితే ఈ సమస్య సురేష్ గోపి తోనే ఉంది అని అనుకుంటే పొరపాటు.

కచ్చితంగా రెండు నెలల కిందట హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ, అదే విధంగా సినీ నటి కంగనా రనోత్ కూడా సేమ్ టు సేమ్ రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకున్నది ఏమీ లేదని సినిమాల్లో ఉంటే బోలెడంత ఆదాయం వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తను పోగొట్టుకున్నది ఎక్కువ అని కూడా వ్యాఖ్యానించారు. తనకు కూడా ఆదాయం సరిపోడం లేదని రాజకీయాల్లోకి వస్తే ఏదో వచ్చేస్తుందని భావించానని కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.

ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే సినిమా రంగం నుంచి ఎన్నో ఆశలతో వస్తున్న వాళ్ళు రాజకీయాల్లో గెలిచినప్పటికీ ఇమడ లేని పరిస్థితిలో నెలకొంటున్నాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి అలానే ఇమడ‌లేక రాజకీయాల నుంచి దూరమయ్యారు. ప్రస్తుతం ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన తన సొంత సొమ్ములనుంచే ప్రజలకి ఖర్చుపెడుతున్నారు. వివిధ రూపాల్లో తన వద్దకు వచ్చిన వారికి సాయం చేస్తున్నారు.

అంటే ఒక రకంగా రాజకీయాల్లోకి రావాలన్న అభిలాష ఉండి రాజకీయాల్లోకి రావడం ఒక ఎత్తు అయితే ఆదాయ మార్గాల విషయంలో కొంత ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి స్పష్టం అవుతుంది. ఇది ముందు ముందు కనక ప్రభావం చూపించగలిగితే సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చేవారు తగ్గుతారని అంటున్నారు ప‌రిశీల‌కులు.