జూబ్లీహిల్స్ పోరు: గెలిస్తే కాంగ్రెస్ రికార్డే!

హైద‌రాబాద్‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారిన విష‌యం తెలిసిం దే. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా.. దీనికి నోటిఫికేష‌న్ ఇచ్చేసింది. ఇక‌, ఇప్పుడు దంగ‌ల్ య‌మ రేంజ్‌లో సాగ‌నుంది. ముఖ్యంగా అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలైన‌.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఉప పోరును రిఫ‌రెండంగా భావిస్తున్నాయి. త‌మ పాల‌న‌కు ప్ర‌జ‌లు వేసే మార్కులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అద్దం ప‌డుతుంద‌ని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.

అయితే.. కాంగ్రెస్ ప్ర‌జాకంట‌క పాల‌న‌కు, కేసీఆర్‌.. ప్ర‌జాపాల‌న‌కు మ‌ధ్య ఇది కీల‌క రిఫ‌రెండం అని బీఆర్ఎస్ నాయ‌కులు చెబుతున్నారు. దీంతో జ‌రుగుతున్న‌ది ఉప పోరే అయినా.. సార్వ‌త్రిక స‌మ‌రాన్ని మించి ఇది ర‌ణ‌రంగంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇక‌, మూడో ప‌క్షం బీజేపీ కూడా ఇంత రేంజ్‌లో కాక‌పోయినా.. మోడీ పాల‌న‌కు… మోడీ అభివృద్ధికి ఇది మ‌చ్చుతున‌క‌గా మారుతుంద‌ని అంటున్నారు. సో.. మొత్తంగా ఈ మూడు పార్టీలు కూడా జూబ్లీహిల్స్‌ను కీల‌కంగానే తీసుకున్నాయ‌ని చెప్పాలి.

ఇక‌, కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే.. 2014 నుంచిఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మూడు ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను మార్చుతూ వ‌చ్చినా.. జూబ్లీహిల్స్‌లో ప‌ట్టు సాధించ‌లేక పోయింది. 2009లో అప్ప‌టి వైఎస్ ప్ర‌భావంతో ప‌బ్బ‌తి రెడ్డి జ‌నార్ద‌న్ రెడ్డి త‌న‌యుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్న ద‌రిమిలా.. 2014, 2018, 2023 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓట‌మిని చ‌విచూసింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో క‌నుక కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటే.. ఒక పెద్ద రికార్డేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కాంగ్రెస్ బ‌లం ఎంత‌?

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌ నుంచి కూడా కాంగ్రెస్ ఇక్క‌డ పెద్ద‌గా బ‌లం చాటుకున్న ప‌రిస్థితి అయితే లేదు. ముఖ్యంగా అభ్య‌ర్థుల‌ను మార్చినా పార్టీ పుంజుకోలేదు. దీనికి కారణం.. నేత‌లు ఎక్కువ మంది టికెట్ ఆశించ‌డం.. వారంతా భంగం ప‌డ‌డం క‌నిపించింది. ఇది ఎన్నిక‌ల స‌మ‌యానికి పార్టీకి మైన‌స్ అయింది. ఇక‌, స్థానిక ప‌రిస్థితుల క‌న్నా కూడా సిఫార‌సుల‌కు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా కూడా అదే జ‌రిగింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక‌, మూడు ఎన్నిక‌ల‌లో ప‌రాజ‌యం త‌ర్వాత‌.. ఇప్పుడు ఏమైనా పుంజుకునే అవ‌కాశం ఉందా? అంటే.. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త కొర‌వ‌డిన నేప‌థ్యంలో అధికార పార్టీ చ‌మ‌టోడిస్తే త‌ప్ప‌.. చెప్పుకోద‌గ్గ ఓటు బ్యాంకును సొంతం చేసుకునే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.