హైదరాబాద్‌లోని కీలకమైన నియోజకవర్గం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఎన్నికల పోరుకు రంగం రెడీ అయింది. ఈ నెల 13 నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. వచ్చే నెల 11 న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 14న రిజల్ట్ రానుంది. ఈ క్రమంలో కీలకమైన అధికార పార్టీ కాంగ్రెస్.. తన అభ్యర్థిని ప్రకటించింది. బుధవారం రాత్రి చాలా పొద్దు పోయాక ఈ స్థానం నుంచి నవీన్ యాదవ్‌ను పోటీకి నిలబెడుతున్నట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి.
ఎవరీ నవీన్?
బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్.. 2014 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం.. ఆయన ఎంఐఎం పార్టీలో చేరారు. అప్పటి ఎన్నికల్లోనే నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున పోటీ చేసిన యాదవ్ యువ నేతగా అందరికీ చేరువయ్యారు. నియోజకవర్గంపైనా పట్టు పెంచుకున్నారు. అయితే.. ఇప్పటికి 2 సార్లు పోటీ చేసినా.. ఆయన ఒక్క సారి కూడా విజయం దక్కించుకోలేదు. పైగా.. మూడో స్థానంలోనే నిలిచారు.
నిజానికి యాదవ్‌కు యూత్ మద్దతు ఉందని అంటారు. కానీ.. ఆయన గెలుపు గుర్రం ఎక్కకపోగా.. బలమైన ఓటు బ్యాంకును కూడా సొంతం చేసుకోలేక పోయారన్నది వాస్తవం. 2014 ఎన్నికల్లో ఎంఐఎం తరఫున పోటీ చేశారు. కానీ, మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2018 ఎన్నికలకు వచ్చే సరికి ఏ పార్టీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కానీ, అప్పుడు కూడా ఓడిపోయారు. పైగా.. డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు.
ఆ తర్వాత.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నవీన్ యాదవ్.. 2023 ఎన్నికల్లో టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ, దక్కలేదు. ఇక, అప్పటి నుంచి మౌనంగా ఉన్న ఆయన.. తాజా ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు. ఇక, గెలుపు ఓటముల విషయానికి వస్తే.. వ్యక్తిగత బలం తక్కువగా ఉన్న నవీన్.. ఆర్ధికంగా బలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైనా భారీ మార్పు వచ్చి.. ప్రజలు ఆయన వెంట నిలిస్తే.. తప్ప.. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదన్నది పార్టీలో వినిపిస్తున్న మాట.
రెండు ఎన్నికల్లో ఎన్నెన్ని ఓట్లు..
నవీన్ యాదవ్ ఇప్పటికి రెండు సార్లు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు.. 41565 ఓట్లు దక్కించుకుని రెండో స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి 7150 ఓట్లుమాత్రమే దక్కించుకున్నారు. ఈ సమయంలోనే ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. మరి ఇప్పుడు అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates