కేసీయార్ ను రావద్దని చెప్పేసిన మోడి

ప్రధానమంత్రి నరేంద్రమోడి హైదరాబాద్ పర్యటన వివాదాస్సదమవుతోంది. కరోనా వైరస్ కు విరుగుడుగా తయారు చేస్తున్న టీకా అభివృద్ధిని స్వయంగా పరీక్షించేందుకు మోడి ఈరోజు మూడు నగరాల్లో ఉన్న ఫార్మా కంపెనీలను సందర్శించనున్న విషయం తెలిసిందే. మొదటగా గుజరాత్ లోని జైడస్ క్యాడిలా ఫ్యాక్టరీని సందర్శిస్తారు. తర్వాత పూణేలోని సీరమ్ కంపెనీకి వెళతారు. ఆ తర్వాత చివరకు హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ఫ్యాక్టరీకి చేరుకుంటారు.

హైదరాబాద్ కు మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో వచ్చి మళ్ళీ 5 గంటల ప్రాంతంలో వెళిపోతారు. హైదరాబాద్ కు ప్రధానమంత్రి వస్తున్న కారణంగా స్వాగతం చెప్పటానికి ముఖ్యమంత్రి కేసీయార్ కూడా రెడీ అయ్యారు. అయితే ఆశ్చర్యంగా కేసీయార్ ను రావద్దని ప్రధానమంత్రి కార్యాలయం నుండి సమాచారం వచ్చింది. మామూలుగా ప్రధాని ఎప్పుడు వచ్చినా సీఎం రిసీవ్ చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. విమానాశ్రయానికి గవర్నర్, సీఎం, మేయర్, మంత్రులు వెళ్ళటం మామూలు.

కానీ ఇపుడు మాత్రం కేసీయార్ రావాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి వ్యక్తిగత సహాయకుడు వివేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్వయంగా ఫోన్ చేప్పటం వివాదాస్పదమైంది. పీఎంకు స్వాగతం చెప్పేందుకు కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు కూడా చెప్పారు. ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మహంతి, సైబరాబాద్ కమీషనర్ వీసీ సజ్జనార్, హకీంపేట ఎయిర్ ఆఫీసు కమాండెంట్ మాత్రమే రావాలని ఆదేశాలు వచ్చాయి.

గతంలో ఏ ప్రధానమంత్రి ఏ కారణాలతో హైదరాబాద్ కు వచ్చినా ఏ ముఖ్యమంత్రిని స్వాగతం చెప్పటానికి రావద్దని చెప్పలేదు. మరిపుడు మోడి మాత్రమే కేసీయార్ ను ఎందుకు రావద్దన్నారన్నది ప్రశ్నగా మారింది. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా మోడి హైదరాబాద్ కు వస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. భారత్ బయోటెక్ లో డెవలప్ అవుతున్న వ్యాక్సిన్ ను పరీక్షించే ముసుగులో మోడి గ్రేటర్ కోసమే హైదరాబాద్ కు వస్తున్నట్లు బాగా ప్రచారంలో ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకునే కేసీయార్ ను మోడి రావద్దన్నారని చెప్పారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి మోడి హైదరాబాద్ లో అడుగుపెట్టటానికి ముందే వివాదం మొదలవ్వటం విచిత్రంగా ఉంది.