బీహార్ ఎల‌క్ష‌న్‌: కుల‌మా-పొలిటిక‌ల్ బ‌ల‌మా?

రాజ‌కీయాల‌కు -కులాల‌కు మ‌ధ్య సంబంధం గురించి ఇటీవ‌ల ఓ కీల‌క మీడియాలో వ‌చ్చిన క‌థ‌నం.. అంతా ఏపీలోనే ఉంద‌ని! కులాలు.. రాజ‌కీయాల క‌ల‌గాపులగం అంతా.. ఏపీ నుంచే ప్రారంభ‌మైంద‌ని.. స‌ద‌రు మీడియా తీర్మానం చేసింది. కానీ.. ఉత్త‌రాదిన ఉన్న కుల రాజ‌కీయాలు మ‌రెక్కడా లేవ‌న్న‌ది స‌ర్వేలు చెబుతున్న మాట‌. అందునా.. బీహార్‌లో అయితే.. కీల‌క‌మైన యాద‌వ సామాజిక వ‌ర్గం.. కుర్మీ సామాజిక వ‌ర్గం… నాయి సామాజిక వ‌ర్గాలు.. మూడుగా చీలి.. రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి. తాజాగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో కులమా.. పొలిటిక‌ల్ బ‌ల‌మా? ఏది ఇక్క‌డి ప్ర‌భుత్వాన్ని.. ఎన్నిక‌ల ను శాసిస్తుంది? అనేది కీల‌కంగా మారింది.

కులం ప‌రంగా చూసుకుంటే..

ఒక‌ప్పుడు యాద‌వ సామాజిక వ‌ర్గం మొత్తం.. ఆర్జేడీ నేత‌.. మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ వెంటే న‌డిచింది. అంతేకాదు.. ప్ర‌త్యేక బీహార్ రాష్ట్ర ఏర్పాటు కోసం.. ఆయ‌న అలుపెరుగ‌ని యుద్ధ‌మే చేశారు. ఇది అప్ప‌ట్లో యాద‌వ సామాజిక వ‌ర్గాన్ని ఆయ న ఏకం చేశారు. ఇది కొన్ని ద‌శాబ్దాల పాటు.. ఆయన వెంట యాద‌వుల‌ను న‌డిపించింది. అయితే.. రాను రాను లాలూ ప్ర‌సాద్ ప్రాభ‌వం త‌గ్గడంతోపాటు.. ఆయ‌న జైలుకు వెళ్లిన ద‌రిమిలా.. ఈ ఓటు బ్యాంకు విచ్ఛిన్న‌మై.. బీజేపీకి మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. ఇక‌, సంప్ర‌దాయ బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం.. ఆది నుంచి బీజేపీవైపే ఉంది. దీనికి ముందు కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు.

ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితిని చూస్తే.. బీజేపీ ఆశ‌ల‌న్నీ.. ఓబీసీల‌పైనే ఉన్నాయి. ఈ వ‌ర్గం.. మొత్తం రాష్ట్రంలో 37 శాతం జ‌నాభాను క‌లిగి ఉంది. అందుకే.. ఈబీసీలో ఉన్న నాయి సామాజిక ఉద్య‌మ క‌ర్త‌.. దివంగ‌త‌ కర్పూరీ ఠాకూర్‌కు మోడీ స‌ర్కారు భార‌త ర‌త్న ఇచ్చి స‌త్క‌రించింది. ఇప్పుడు దానిని ప్ర‌చారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. అదేవిధంగా రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ గా ఉన్న హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ కూడా ఓబీసీ నాయ‌కుడే. పైగా బీజేపీ నేత‌. ఈ నేప‌థ్యం కూడా బీజేపీకి క‌లిసి రానుంది. ఇక‌, 18 శాతంగా ఉన్న యాద‌వ సామాజిక వ‌ర్గంలో కొంత మేర‌కు చీలిక వ‌చ్చినా.. 11 శాతం ఓటు బ్యాంకు ఆర్జేడీ వైపే ఉంది. దీనిపైనే తేజ‌స్వి యాద‌వ్‌(లాలూ కుమారుడు) ఆశ‌లు పెట్టుకున్నారు.

అందుకే.. యాద‌వ సామాజిక వ‌ర్గ‌మే.. కాదు.. ఓబీసీల‌ను కూడా త‌న‌వైపు తిప్పుకొనేందుకు ఆయ‌న బీహార్ అధికార యాత్ర‌చే ప‌ట్టారు. త‌ద్వారా రాష్ట్రంలో ఆయా సామాజిక వ‌ర్గాలను త‌న‌వైపు తిప్పుకోవాల‌ని చూస్తున్నారు. ఇక‌, త‌టస్థ ఓటు బ్యాంకు కేవ‌లం 2 – 3 శాతం మాత్ర‌మే ఉంది. ఇక‌, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు 20 శాతంగా ఉంది. దీనిపై అటు ఆర్జేడీ, ఇటు కాంగ్రెస్ ఆది నుంచి ప‌ట్టు సాధిస్తున్నాయి. కానీ, ఈ ద‌ఫా గిరిజ‌న ప్రాంతాల్లో చేసిన అభివృద్ధిని బీజేపీ ప్ర‌చారం చేస్తోంది. సో.. ఇక్క‌డ కూడా ఓటు బ్యాంకు చీలే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. సో.. ఎలా చూసుకున్నా.. రాజ‌కీయ బ‌లాల క‌న్నా.. కులాల కుంప‌ట్ల‌పైనే ఎక్కువ‌గా ఈ ఎన్నిక ఆధార‌ప‌డింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక‌, మ‌రో కీల‌క‌మైన విష‌యం.. సీఎం నితీష్ కుమార్ సామాజిక వ‌ర్గం కుర్మి. ఈ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌లు కేవ‌లం 3 శాత‌మే ఉన్నారు. అయితేనే.. ఆ ఓట్ల‌న్నీ.. సుశాన్‌బాబు(మంచి పాల‌నా ద‌క్షుడు)గా పేరున్న నితీష్‌కే ప‌డుతున్నాయి. సో.. ఇదీ.. సంగ‌తి!!.