ఏ క్ష‌ణ‌మైనా మోహిత్ రెడ్డి అరెస్టు!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కుమారుడు.. మోహిత్ రెడ్డిని ఏ క్ష‌ణమైనా పోలీసులు అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ పాల‌నా కాలంలో చోటు చేసుకున్న భారీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి తాజాగా హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. మోహిత్‌రెడ్డి దాఖ‌లు చేసుకున్న‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఈ కేసులో విచార‌ణ జ‌ర‌కుండానే బెయిల్ ఇవ్వ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించింది.

దీంతో మోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు రెడీ అవుతున్నారు. వైసీపీ హ‌యాంలో 3500 కోట్ల రూపాయ‌ల పైచిలుకు మ‌ద్యం కుంభ‌కోణం జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఆ నాటి గుట్టును వెలికి తీసేందుకు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్ప‌టికి ఈ కేసులో 49 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో మోహిత్ రెడ్డి 49వ నిందితుడిగా ఉన్నారు. ఈయ‌న‌ను అరెస్టు చేసి విచారించేందుకు సిట్ అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

కానీ, త‌న‌కు సంబంధం లేని కేసులో ఇరికించార‌ని.. రాజ‌కీయ ప్రేరేపిత కేసు అని మోహిత్ రెడ్డి ముందు నుంచి వాదిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ముంద‌స్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇప్ప‌టి వ‌ర‌కు.. ప‌లు మార్లు జ‌రిగిన విచార‌ణ‌లో మోహిత్ రెడ్డికి ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌క‌పోయినా.. ఆయ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా కోర్టు ర‌క్ష‌ణ క‌ల్పించింది. దీంతో మోహిత్ రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు విచార‌ణ నుంచి కూడా త‌ప్పించుకుంటున్నారు.

తాజాగా మంగ‌ళ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో హైకోర్టు ఆయ‌న ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను ర‌ద్దు చేయ‌డమే కాకుండా.. విచార‌ణ‌కు కూడా స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది. దీంతో మోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధ‌మ‌య్యారు. మ‌రోవైపు.. ఇదే కేసులో చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి 48వ నిందితుడిగా ఉన్నారు. ఆయ‌న ప్రస్తుతం విజ‌య‌వాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విష‌యం తెలిసిందే.