ముంబైలో లోకేష్ బిజీ బిజీ: పెట్టుబ‌డుల వేట‌!

టీడీపీ యువ నాయ‌కుడు, ఏపీ ఐటీ శాఖ‌ మంత్రి నారా లోకేష్ మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు పారిశ్రామిక వేత్త‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఆయ‌న ఒక‌ర‌కంగా వేట చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ముంబైలో ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి లోకేష్ కూడా.. ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. ఆయ‌న వెంట మంత్రి టీజీ భ‌ర‌త్ కూడా ఉన్నారు. పెట్టుబ‌డుల విష‌యంలో ఏపీ అనుస‌రిస్తున్న విధానాల‌ను వివ‌రించారు.

ప్ర‌స్తుతం ఏపీలో సింగిల్ విండో విధానంతో పాటు.. 48 గంట‌ల్లోనే అనుమ‌తులు ఇచ్చే వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌ని మంత్రి వివ‌రించారు. ఎక్క‌డ కావాలంటే.. అక్క‌డ భూములు కేటాయిస్తామ‌ని.. పెట్టుబ‌డుల‌కు అనుకూలంగా క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, గుంటూరు త‌దిత‌ర ప్రాంతాలు ఉన్నాయ‌న్నారు. అమ‌రావ‌తి అభివృద్ధి చెందుతున్న ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా రూపాంతరం చెందుతుంద‌న్నారు. ఇక్క‌డ అనేక సంస్థ‌లు అందుబాటులోకి వ‌స్తున్నాయ‌న్నారు.

ఈ క్ర‌మంలో `ట్రాఫికారా` సంస్థ అధిప‌తి స‌చిన్ గుప్తాతో మంత్రి నారా లోకేష్ ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో విద్యుత్ ప్రాజెక్టులు స‌హా పోర్టుల రంగంలో పెట్టుబ‌డులకు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు. ఇప్పటికే ప‌లు కంపెనీలు పెట్టుబడులు పెట్టాయ‌న్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉంద‌ని.. అదేస‌మ‌యం లో 50 కిలో మీట‌ర్ల‌కు ఒక‌టి చొప్పున ప్ర‌త్యేకంగా స‌రుకు ర‌వాణా నౌకాశ్ర‌యాల‌ను నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. అదేవిధంగా అన్ని పోర్టుల‌ను జాతీయ ర‌హ‌దారులతో అనుసంధానం చేస్తున్నామ‌న్నారు.

త‌ద్వారా పెట్టుబ‌డులు పెట్టేవారికి స‌రుకుర‌వాణా ఈజీగా మార‌నుంద‌ని వివ‌రించారు. అలాగే, భూములు, విద్యుత్‌, నీటి విష‌యంలో ప్ర‌భుత్వం భారీ ఎత్తున రాయితీలు ఇస్తున్న‌ట్టు తెలిపారు. అయితే.. స్థానికంగా యువ‌త‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని సూచించారు. నైపుణ్యాభివృద్ధిలో యువ‌త‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చామ‌ని.. వారికి అవ‌కాశాలు క‌ల్పించాల‌ని కోరారు.