దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం రెండు దశలలో నిర్వహించనున్న ఈ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో తాజాగా వెల్లడించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను.. రెండు దశల్లో ఎన్నికల్లో నిర్వహించనున్నారు. నవంబరు 6, 11న ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇక, సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ప్రకటించారు.
నవంబరు 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. మొత్తం 7.8 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఎన్నికల సంఘం అనుమతించిన ఏ గుర్తింపు కార్డును అయినా వినియోగించి ఓటు వేయొచ్చని సూచించారు. తొలి దశ పోలింగ్ నవంబరు 6న నిర్వహించనున్నట్టు చెప్పారు. రెండో దశ నవంబరు 11న నిర్వహిస్తారు. ఈ రెండు ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. అన్ని పోలింగ్ స్టేషన్లను 100 శాతం వెబ్ క్యాస్టింగ్ చేసినట్టు వివరిం చారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో 90 వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అభ్యర్థులు ఎవరైనా ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తే..కఠిన చర్యలు తీసుకుం టామని జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. అవసరమైతే.. వారి అభ్యర్థిత్వాన్ని సైతం రద్దు చేసే నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా ప్రజలు సైతం.. ఎన్నికల సంఘం విడుదల చేసిన యాప్‌లో ఎప్పటి కప్పుడు ఫిర్యాదులు చేసే అవకాశం ఉందన్నారు. వారి ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకునేందుకు 30 వేల మందితో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
సాయంత్రం 6గంటల వరకు ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంటుందని జ్ఞానేష్‌కుమార్ చెప్పారు. ఎక్కడా ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా.. పోలింగ్ కు ముందు రోజు సహా.. కౌంటింగ్ జరిగే రోజు కూడా.. సీఆర్ పీఎఫ్ దళాలతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్టు చెప్పారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు విధిగా నిబంధనలు పాటించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates