ఏపీలో అనునిత్యం ఏదో ఒక సమస్య సీఎం చంద్రబాబుకు ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన సమస్యలు.. కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. గత ఆరు మాసాల్లో .. పొగాకు, మామిడి, మిర్చి, ధాన్యం, ఉల్లిపాయలు, యూరియా, అకాల వరద నష్టాలు.. ఇలా.. అనేక అంశాల్లో సర్కారు ఇరుకున పడుతూనే ఉంది. రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోవడం… కేంద్రం నుంచి సరైన సహకారం లేకపోవడం వంటివి ఇబ్బందిగానే ఉన్నాయి. దీంతో చంద్రబాబు ఆయా సమస్యలను అడ్రస్ చేస్తూనే ఉన్నా.. అవి అపరిష్కృతంగానే ఉంటున్నాయి.
తాజాగా ఇప్పుడు టమాటా సమస్య తెరమీదికి వచ్చింది. నాలుగు రోజుల కిందటి వరకు కిలో టమాటా రూ.15 ఉండగా ప్రస్తుతం రైతులకు కిలోకు రూ.1 మాత్రమే లభిస్తోంది. దీంతో కర్నూలు మార్కెట్‌లో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు.. పంటను కూడా రోడ్డుపై పోసి.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను ఎలా పరిష్కరించాలన్న విషయంపై సర్కారుకు ముఖ్యంగా చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.
ఈ క్రమంలో తాజాగా రంగంలోకి దిగిన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయడు.. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాప్తాడు మార్కెట్ లో ఆదివారం టమోటా ధరలు గరిష్టం రూ.18, కనిష్ఠం రూ.9, మోడల్ ధర రూ.12 గా ఉన్నాయని.. 30 నుండి 40 మెట్రిక్ టన్నులు మించి పత్తికొండ మార్కెట్ సరుకు రాదని, కానీ, దసరా సెలవులు కావడంతో మరొక 10 టన్నులు అదనంగా చేరుకుందన్నారు. రోడ్లపై 2వ గ్రేడ్ క్వాలిటీ టమాటాలు వేసి గందరగోళం సృష్టించారని.. దీని వెనుక ఎవరున్నారోతేలుస్తామని చెప్పారు.
ఇప్పటివరకు 10 మెట్రిక్ టన్నుల టమోటాలను వివిధ రైతు బజార్లకు పంపించామన్న మంత్రి.. పత్తికొండ మార్కెట్ లో టమోటాలు సేకరించి చిత్తూరు ప్రొసెసింగ్ యూనిట్ కి 10 మెట్రిక్ టన్నులు, రైతు బజార్లకు 15 మెట్రిక్ టన్నులు పంపిస్తామన్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు సరుకు ఎగుమతి వర్షాల వల్ల తగ్గిందన్న ఆయన.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో టమాటా అమ్మకాలు మందగించాయని పేర్కొన్నారు. టమోటాలకు ట్రెండింగ్ ధరను బట్టి ప్రస్తుతం మంచి ధర లభిస్తుందని, ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అన్ని విధాలుగా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుoదని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల మాటను విశ్వసించరాదన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates