మంత్రుల వైఖరిపై కొన్నాళ్లుగా అసహనంతో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రోజు రెండు ఘటనలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. ఈ రెండు అంశాలు పత్రికల్లో భారీ ఎత్తున కవర్ అయ్యాయి. అయితే.. ఈ విషయాలపై మంత్రులు స్పందించకపోవడాన్ని తాజాగా సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. “నేను చెబితే కానీ.. కదలరా?” అంటూ.. అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయా అంశాలపై తనకు నివేదిక అందించాలని ఆయన ఆదేశించారు.
ఏంటా ఘటనలు..
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గిరిజన సామాజిక నియోజకవర్గం కురుపాంలో ఉన్న గిరిజన సంక్షేమ వసతి గృహంలో బాలికలు.. పచ్చకామెర్లతో అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇక, ఇదేసమయంలో పదుల సంఖ్యలో బాలికలు ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలపై కలెక్టర్ స్పందించినా.. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సంధ్యా రాణి మాత్రం మౌనంగా ఉన్నారు. పైగా ఆమె విజయనగరం ఉత్సవాల్లో పాల్గొన్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు తెలుసుకుని తనకు నివేదిక ఇవ్వాలని .. బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
ఇక, అనంతపురం జిల్లాలోని అనాథ శిశువుల సంక్షేమ కేంద్రంలో మహిళా సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం ఓ శిశువు మృతికి దారి తీసింది. దసరా రోజు డ్యూటీ విషయంలో దెబ్బలాడుకున్న ఇద్దరు మహిళా సిబ్బందిలో ఒకరు అయిష్టంగానే డ్యూటీకి వచ్చారు. ఈ క్రమంలో ఆమె.. పనులు చేయకుండా సీట్లో కూర్చున్నారు. అయితే.. ఓ శిశువు ఆకలికి తాళలేక.. తెల్లవారే సరికి ప్రాణాలు కోల్పోయాడు. వాస్తవానికి శిశువుకు పాలు అందించాల్సిన బాధ్యతను సదరు ఉద్యోగి విస్మరించింది.
ఇక, విషయాన్ని బయటకు రాకుండా చేసేందుకు ఆసుపత్రి ఆవరణలోనే శిశువు మృత దేహాన్ని పూడ్చి పెట్టారు. ఈ విషయం వెలుగులోకి వచ్చినా.. సంబంధిత మంత్రి పట్టించుకోకపోవడంతో సీఎం చంద్రబాబు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ విషయం పత్రికల్లో వచ్చే వరకు.. మీరు ఎందుకు తెలుసుకోలేక పోతున్నారంటూ” ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. నివేదిక ఇవ్వాలని కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates