ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మధ్య ఇప్పటికే ఒక వివాదం ఉన్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో తనను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని జగన్.. అలా కుదరదని అయ్యన్న వాదించుకుంటున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టుల పరిధిలో ఉంది. ఇదిలావుంటే.. వైసీపీ హయాంలో అయ్యన్న సొంత నియోజకవర్గం.. నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిర్మించామని.. వైసీపీ నాయకులు చెబుతున్నారు.
ఇటీవల ప్రభుత్వం వైసీపీ హయాంలో తీసుకువచ్చిన 17 మెడికల్ కాలేజీలలో 12 కాలేజీలను పీపీపీ విధానానికి ఇస్తున్నట్టు ప్రకటించింది. అయితే.. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన వైసీపీ.. అలా ఎలా ఇస్తారని ప్రశ్నించడంతోపాటు.. పేదలకు వైద్యాన్ని దూరం చేస్తున్నారని వాదనకు దిగింది. ఈ క్రమంలో అసెంబ్లీలో నే స్పందించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. “మా నియోజకవర్గంలో కూడా మెడికల్ కాలేజీని మొదలు పెట్టారు. కానీ, ఏమైంది.. పునాదులు కూడా దాటలేదు. ఇప్పుడు పీపీపీకి అయినా.. ఇస్తే.. నిర్మాణాలు పూర్తవుతాయి.” అని అన్నారు.
అంతేకాదు.. అసలు దీనిపై జీవో కూడా ఇవ్వలేదని అయ్యన్న వ్యాఖ్యానించారు. జీవో ఉంటేనే కదా.. కట్టడానికి అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న జగన్.. ఈ నెల 8న నర్సీపట్నంలో పర్యటన పెట్టుకున్నారు. అదే మెడికల్ కాలేజీని సందర్శించి.. నిర్మాణాలు ఎక్కడిదా కా వచ్చాయి. అనే విషయాలను నేరుగా నిరూపించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు స్థానిక వైసీపీ నాయకులకు సమాచారం చేరవేశారు. నేను వస్తున్నాను.. ఏర్పాట్లు చేయండి.. అని జగన్ నుంచి వారికి కబురు అందింది.
అయితే.. ఈ విషయంలో పోలీసులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజకీయంగా ఈ వ్యవహారం వివాదం అవుతుందని భావిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. వైసీపీ నాయకులు కూడా.. అనుమ తులు కోరలేదు. అనుమతి లేకుండానే జగన్ వెళ్తారా? లేక.. ఏం చేస్తారు? అనేది చూడాలి. ఏదేమైనా.. నర్సీపట్నం పర్యటన కు వెళ్లేది ఖాయమని తాడేపల్లివర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై స్పీకర్ స్పందించాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates