నియోజకవర్గం వైసీపీ నేతది. కానీ, ఇక్కడ జరుగుతున్న నకిలీ మద్యం దందా మాత్రం టీడీపీ కీలక నేత కనుసన్నల్లోనే జరుగుతోందని అధికారులు తేల్చారు. ఈ వ్యవహారం పతాక శీర్షికల్లో రావడంతో సీఎం చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. శనివారం సాయంత్రం ఆయన ప్రత్యేకంగా అధికారులతో భేటీ అయ్యారు. ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఎవరికి చెప్పారు? ఎక్సైజ్ మంత్రికి చెప్పారా? లేదా? అని నిప్పులు చెరిగారు. అంతేకాదు.. అసలు నియోజకవర్గం ఎమ్మెల్యే పాత్ర దీనిలో ఎంత ఉంది? అనేది కూడా తేల్చాలని ఆదేశించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరింత సీరియస్‌గా మారింది.
ఏం జరిగింది?
సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని కీలకమైన నియోజకవర్గం తంబళ్లపల్లి. ఇక్కడ నుంచి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి వరుస విజయాలు దక్కించుకున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు. అయితే.. ఇక్కడ తాజాగా కోటిన్నర రూపాయలకు పైగా విలువైన నకిలీ మద్యం తయారీ డంప్‌ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. దీనిని ఆరాతీయగా.. విజయవాడకు చెందిన ఓ వ్యాపారి ఇక్కడ పాగా వేసి.. కొందరు యువతను పోగేసి.. ఓ ముఠాగా ఏర్పడి.. ఈ నకిలీ మద్యం తయారీ దందాను నడిపిస్తున్నారని తెలిసింది.
అంతేకాదు.. ఈ నకిలీ మద్యాన్ని నేరుగా వైన్స్‌కు, బార్లకు కూడా అమ్ముకుని సొమ్ములు చేసుకుంటున్నారు. అయితే.. ఇదంతా కూడా.. టీడీపీ కీలక నేత కనుసన్నల్లోనే జరుగుతోందని, సదరు నాయకుడి పీఏగా ఉన్న వ్యక్తి ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. వెంటనే పీఏను కూడా అరెస్టు చేశారు. ఈ వ్యవహారం బహిర్గతం అయింది. పతాక శీర్షికల్లో కథనాలు కూడా వచ్చాయి. దీనిపై సర్కారుకు సెగ తగులుతుండడం.. టీడీపీ సీనియర్ నేతే దీని వెనుక ఉన్నారన్న వాదనను పోలీసులు కూడా నిర్ధారిస్తుండడంతో సీఎం స్వయంగా జోక్యం చేసుకున్నారు. దీనివెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో వెలికి తీయాలని ఆదేశించారు.
ముఖ్యంగా తన నియోజకవర్గంలో జరుగుతున్న దందాపై వైసీపీ ఎమ్మెల్యేకు సమాచారం ఉందా? లేదా? అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని ఆదేశించారు., ఆయనకు కూడా ముడుపులు అందుతున్నాయా? లేక కావాలనే చూస్తూ ఊరుకున్నారా? అనేది తేల్చాలని.. ఎవరున్నా వదిలి పెట్టరాదని కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వానికిమచ్చ తెచ్చేవారిని ఉపేక్షించరాదని కూడా ఆయన తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఆదిశగా విచారణను ప్రారంభించనున్నారు. ఇదిలావుంటే, ద్వారకానాథ్ రెడ్డి ప్రమేయం లేదని.. పార్టీ వర్గాలు చెబుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates