తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా జరగనుంది. గ్రామ పంచాయతీలు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు సహా అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో జనసేన పార్టీని విస్తరించే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయ పరిణామాలపై స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులతో చర్చించిన తెలిసింది
జనసేన పార్టీకి బలం ఉన్న హైదరాబాద్, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలు సహా కరీంనగర్లో విస్తరించాలని.. స్థానిక నాయకత్వానికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని.. ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై మరింత లోతుగా చర్చించి నిర్ణయించే బాధ్యతలను పార్టీ కీలక నాయకులకు అప్పగించాలని చూస్తున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన రామ్ కు ప్రధాన కార్యదర్శి పోస్టును ఇచ్చారు. తద్వారా తెలంగాణకు కూడా ప్రాధాన్యమిస్తున్నామన్న సంకేతాలను పంపించినట్టు అయింది.
దీంతో తెలంగాణలో పార్టీ విస్తరించడంతోపాటు, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే దిశగా కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అయితే, బీజేపీతో చెలిమి ఉన్న నేపథ్యంలో కలిసే స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీలో బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చని అంటున్నారు.
అయితే దీనిపై ప్రస్తుతం ఇంకా చర్చల దశ నడుస్తోంది. ఒకవేళ బిజెపి కనక ఓకే అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా పార్టీని విస్తరించడంతో పాటు బిజెపితో కలిసి అడుగులు వేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో విస్తరించాలన్న వ్యూహంతో ఉన్న బిజెపి తనకు అందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను వదులుకునే అవకాశం ఆ పార్టీకి లేదు.
కాబట్టి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చని నాయకులు భావిస్తున్నారు. 2023 లో జరిగిన ఎన్నికల్లో బిజెపికి పరోక్షంగా మద్దతు ఇచ్చిన జనసేన 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఏపీలో నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిజెపి కూడా ఏపీలో పుంజుకుంది. ఇప్పుడు తెలంగాణలోనూ ఇరు పార్టీలు కలిసి ముందుకు సాగే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates