ఆటోవాలా చంద్రబాబు, పవన్, లోకేశ్

ఏపీలో స్త్రీ శక్తి పథకం ద్వారా నిర్దేశించిన ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. అయితే, అదే సమయంలో ఈ పథకం అమలు నేపథ్యంలో ఆటో, క్యాబ్  డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్న నేపథ్యంలో వారికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో లేని సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా ఆటో, క్యాబ్ డ్రైవర్లందరికీ ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఈ పథకం ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని సింగ్ నగర్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నుంచి విజయవాడ సింగ్ నగర్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల మేర చంద్రబాబు, పవన్, లోకేష్ లబ్ధిదారుల ఆటోలో ప్రయాణించారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కూర్చుని ఈ ముగ్గురు వేరువే రు ఆటోల్లో సింగ్ నగర్ చేరుకున్నారు. ఆటో డ్రైవర్లకు పవన్, లోకేష్ బాడుగ డబ్బులు కూడా ఇచ్చారు.

ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ ఏపీ ఇన్చార్జి రామ్ మాధవ్ తదితరులు ఆటో డ్రైవర్ల మాదిరిగా ఖాకీ చొక్కా వేసుకొని సభా వేదికపై కూర్చున్నారు. ఆటోవాలా లుక్ లో ఉన్న వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆటో, ట్యాక్సీ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రతి ఏటా 15 వేల రూపాయల ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా అందనుంది. 2.6 లక్షల మంది ఆటో డ్రైవర్లు, 20,0 72 మంది ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6400 మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 436 కోట్ల రూపాయలను వారి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకానికి అర్హులై లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకుంటే ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది.