సినీ వివాదాలతో రాజకీయాలు చేయాలని భావిస్తున్న వైసీపీ ఎప్పటికప్పుడు తప్పటడుగులు వేస్తూ ప్రజల ముందు బలహీనపడుతోందనే వాదన వినిపిస్తోంది. సినీ పరిశ్రమను, రాజకీయాలను విడదీయలేని పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. సినీ రంగానికి చెందిన అనేక మంది నాయకులు రాజకీయాల్లోకి వచ్చి పదవుల్లో కొనసాగుతున్నారు. ఏపీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ హీరో అన్న విషయం తెలిసిందే. అదే విధంగా టిడిపిలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా నటసింహంగా పేరు తెచ్చుకున్నారు.
అయితే అప్పుడప్పుడూ కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వివాదాలు తెరమీదకు వచ్చిన ప్రతిసారి అవి ప్రత్యర్థులకు రాజకీయ అస్త్రాలుగా మారుతున్నాయి. తద్వారా వారు రచ్చచేసి, రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించడం తెలిసిందే. ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఇలాంటి చిన్నపాటి వివాదాలను పెద్దవి చేస్తూ లాభం పొందాలని చూస్తోందన్నది తెలిసిందే.
గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను పెద్దవి చేసి, టిడిపికి మరియు జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య మరింత దూరం పెంచాలని ప్రయత్నాలు చేశారు. అయితే అవి విఫలమయ్యాయి. ఆ వివాదంపై జూనియర్ సైలెంట్‌గా ఉండగా, మరోవైపు చంద్రబాబు సదరు ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ వివాదం ముగిసిపోయింది.
‘పుష్ప’ సినిమా విడుదల సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో కూడా వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. మెగా కుటుంబానికి, అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య విభేదాలు రేపే ప్రయత్నం జరిగిందన్న చర్చ ఉంది. ఆ సమయంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ తాము జోక్యం చేసుకోబోమని పేర్కొన్నారు. దీనిని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకొని, అల్లు అరవింద్ కుటుంబానికి పవన్ కళ్యాణ్‌కు మధ్య విభేదాలు పెరుగుతున్నాయని ప్రచారం చేసింది. కానీ అవి కూడా సక్సెస్ కాలేదు.
ఇక ఇటీవల అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను వైసీపీ మీడియా గత నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. చిరంజీవిని బాలకృష్ణ దూషించారని అయినా ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాని, అటు సీఎం చంద్రబాబు గాని పట్టించుకోలేదని, బాలకృష్ణను పిలిచి మాట్లాడలేదని, అదే సమయంలో చిరంజీవిని కనీసం ఓదార్చలేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిజానికి అదే సమయంలో బాలకృష్ణ జగన్‌ను కూడా సైకో అంటూ దూషించారు.
దీనిపై పెద్దగా స్పందించని వైసీపీ నాయకులు, చిరంజీవిని తిట్టారంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై జనసేన నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, కాపు వర్గ నాయకులు తల్లడిల్లుతున్నారని వార్తలు రాస్తున్నారు. అంటే సినీ రంగంలో చోటుచేసుకున్న పరిణామాలను రాజకీయంగా తమకు ఉపయోగించుకొని చిరంజీవిని తమ వర్గంలోకి మార్చుకోవాలని వైసీపీ ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఇరుపక్షాలు సంయమనం పాటిస్తుండడంతో వైసీపీకి అవకాశం దొరకడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates