అవును! జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సొంత పార్టీ నాయకుల నుంచే వివాదాలు వస్తున్నాయి. వాస్తవానికి పార్టీ నాయకులను ఆయన హెచ్చరిస్తున్నా ఎక్కడా ప్రయోజనం కనిపించడం లేదు. అటు సభలోను, ఇటు బయట కూడా నాయకులు చేస్తున్న రాజకీయాలు సేనానికి సమస్యగా మారాయి.
సభలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సమస్యలపై చర్చించాలని ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు ముందు పవన్ కల్యాణ్ ఆదేశించారు. అయితే సగం మంది ఎమ్మెల్యేలు కూడా సరిగా సభకు రాలేదు. ఇది పెద్ద మైనస్.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పార్టీ ముఖ్యనేత, మంత్రి నాదెండ్ల మనోహర్ సభలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. “సభ్యులు పలచగా ఉన్నారు. మీరేమో ముఖ్యమని చెబుతున్నారు” అని ఉపసభాపతి మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించినప్పుడు, “మా సభ్యులు (జనసేన) ఉన్నారు అధ్యక్షా” అని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీంతో, “ఆ సభ్యులు లేరు (వైసీపీ). మీ సభ్యులు కూడా లేరు.. కానివ్వండి” అని వ్యాఖ్యానించారు. మంత్రి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు పట్టుమని 10 మంది కూడా సభలో కనిపించలేదు.
వాస్తవానికి గత ఎన్నికల్లో జనసేన తరఫున 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తాజాగా సభకు మాత్రం కేవలం 12-13 మంది మాత్రమే హాజరయ్యారు. ఒక రోజు అయితే ఏడుగురు కూడా రాలేదు. ఇది రికార్డులే చెబుతున్న మాట. దీనికి కారణాలు ఏమీ లేవని, నియోజకవర్గంలో పనులు కారణంగా వారు రాలేదని అంటున్నారు. కానీ వాస్తవానికి ఇప్పుడు జరగాల్సినవి ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండానే జరుగుతున్నాయి. దీనిలో వారి పాత్ర తక్కువగానే ఉంది. అయినా ఈ విషయాన్ని చెప్పి వారు సభకు డుమ్మా కొడుతున్నారు.
ఇక నెల్లిమర్ల, తిరుపతి, పోలవరం నియోజకవర్గాలు జనసేనకు సెగ పెడుతున్నాయి. ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అనుకూల మీడియాలోనే వ్యతిరేక కథనాలు వస్తుండటం గమనార్హం. వీటిని ఖండించాలని ప్రయత్నిస్తున్నా మీడియా ప్రతినిధులు వాస్తవాలను ఫొటోలు, ఆడియోలు, వీడియోల రూపంలో చూపిస్తున్నారు. దీంతో పార్టీ అగ్రనేత ఈ సమస్యల నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం.
ఏదేమైనా, సేనానికి సేనతోనే ఇబ్బందులు వస్తున్నాయన్నది వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates