తెలంగాణ స్థానిక సంస్థలకు నగారా మోగింది. గత కొన్నాళ్లుగా చర్చనీయాంశం అయిన.. ఈ ఎన్నికలను హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్వహించకతప్పని పరిస్థితి ఏర్పడింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ స్థానిక సమరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వెల్లడించిన వివరాల ప్రకారం..
+ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం 5 దశల్లో జరుగుతాయి.
+ మండల ప్రజాపరిషత్(ఎంపీటీసీ), జిల్లా ప్రజాపరిషత్(జడ్‌పీటీసీ)లకు తొలి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
+ గ్రామ పంచాయతీలకు 3, 4, 5 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
+ ఎంపీటీసీ, జడ్పీటీసీలకు అక్టోబర్ 23, 27 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు.
+ నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపడతారు.
+ గ్రామ పంచాయతీలకు అక్టోబర్ 31, నవంబర్ 4, 8న పోలింగ్ జరుగుతుంది.
+ గ్రామ పంచాయతీల్లో పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపడతారు.
ప్రక్రియ ఇలా మొదలు..
ఫస్ట్ ఫేజ్: నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9-11 మధ్య, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 12, నామినేషన్ల ఉపసంహరణ-అక్టోబర్ 15న చేపడతారు.
సెకండ్ ఫేజ్: నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 13-15 మధ్య, నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 16న చేపడతారు. ఉపసంహరణకు అక్టోబర్ 19 వరకు అవకాశం ఉంటుంది.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తొలి దశ.. నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 17-19 మధ్య ఉంటుంది. పరిశీలన: అక్టోబర్ 20న చేపడతారు. ఉపసంహరణకు అక్టోబర్ 23 వరకు అవకాశం ఉంది. రెండో దశలో నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 21- 23తేదీలను నిర్ణయించారు. వీటి పరిశీలన: అక్టోబర్ 24, ఉపసంహరణ- అక్టోబర్ 27న ఉంటుంది. మూడో దశలో నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 25- 27 మధ్య ఉంటుంది. వీటి పరిశీలన: అక్టోబర్ 28న చేపడతారు. ఉపసంహరణకు అక్టోబర్ 31 వరకు గడువు ఉంటుంది.
ఎన్నెన్ని ఉన్నాయి?
+ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 మండలాలు ఉన్నాయి.
+ వీటిలో 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి
+ వీటిలో మొత్తం 1,12,288 వార్డులు ఉన్నాయి.
+ మొత్తం 12,733 గ్రామపంచాయతీలు ఉండగా వీటికి మూడు దశలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates