పిక్ ఆఫ్ ద డే!.. పవన్ ఇంట చంద్రబాబు!

సెలవు దినం ఆదివారం హైదరాబాద్ లో ఓ ఆసక్తికర సస్నివేశం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా బాబుకు పవన్ ఎదురేగి స్వాగతం పలకగా, పవన్ ను బాబు ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఇద్దరూ పవన్ ఇంటిలో కూర్చుని కబుర్లలో పడ్డారు. పవన్ కు వచ్చిన వైరల్ ఫీవర్ గురించి బాబు ఆరా తీయగా… తన ప్రస్తుత పరిస్థితి, తీసుకుంటున్న చికిత్స, చికిత్సతతో మెరగువుతున్న ఆరోగ్యం తదితరాలను బాబుకు పవన్ వివరించారు.

చంద్రబాబు తన ఇంటికి వచ్చిన సమయంలో ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి.. ఆయన అందించిన పుష్పగుచ్ఛాన్ని స్వీకరించిన పవన్… బాబును తన ఇంటి లోపలికి తీసుకెళ్లే సమయంలో ముక్కును తన చేతి రుమాలుతో కప్పుకున్నారు. వైరల్ ఫీవర్ కావడంతో ఎక్కడ తన జ్వరం బాబు, ఇతరులకు సోకుతుందోనన్న ఆందోళనతోనే పవన్ ఈ జాగ్రత్త తీసుకున్నట్టు సమాచారం. ఇక తన ఇంటిలో బాబుకు పవన్ కాస్తంత దూరంలోనే కూర్చుని మాట్లాడారు. అంతేకాకుండా పవన్ పెద్దగా మాట్లాడకుండానే… బాబు అడిగిన వాటికి సమాధానాలు ఇస్తూ సాగినట్టు సమాచారం.

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలోనే ఉన్న పవన్ అక్కడే వైరల్ ఫీివర్ బారిన పడిన విషయం తెలిసిందే. పవన్ తన తాజా చిత్రం ఓజీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ఒకింత అనారోగ్యంతోనే వెళ్లిన పవన్ అక్కడ వర్షంలో తడిశారు. దీంతో పవన్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. గత వారం సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పవన్… అనారోగ్యం కారణంగా ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లలేకపోయారు. అయితే జ్వరం తగ్గితే అసెంబ్లీకి వెళదామని భావించిన పవన్… 3 రోజుల పాటు అక్కడే ఉండిపోయారు. జ్వరం తగ్గకపోవడంతో ఆయన మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాల కారణంగా పవన్ ను బాబు పరామర్శించలేకపోయారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ముగియడం, తాను హైదరాబాద్ లో ఉండటంతో పవన్ ను బాబు పరామర్శించారు.