ప్రజాసేవలో మద్దిపాటి వెంకటరాజు జోరు

ప్రజా ప్రతినిధి అంటే…ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇలా ఎన్నో పదవులను ఆశిస్తూ ప్రస్తుత యువత అప్పటిదాకా చేస్తున్న ఉద్యోగాలను వదిలి రాజకీయాల్లోకి వస్తున్నారు. అదృష్టం బాగుంటే… ప్రజా ప్రతినిధులు అవుతున్నారు. లేదంటే ఒక్కసారికే వెనుదిరిగిపోతున్నారు. ఇక ప్రజా ప్రతినిధులుగా గెలిచిన వారు కూడా ఏదో నామ్ కే వాస్తేలా పర్యటనలు చేస్తూ తమ పని అయిపోయిందని భావిస్తున్నారు. ఇలాంటి రెండు వర్గాలకు చెందని వారే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు పార్టీ కోసం కష్టపడ్డ మద్దిపాటి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాక ప్రజా సేవలో తనదైన జోరు చూపిస్తున్నారు.

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మద్దిపాటి… పీజీ దాకా చదువుకున్నారు. విద్యాభ్యాసం ముగిసిన వెంటనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. మరి ఆ ఉద్యోగం బోర్ కొట్టిందో, లేదంటే ప్రజా సేవపై మక్కువ కలిగిందో తెలియదు గానీ… 2014లో టీడీపీలో చేరిపోయారు. గోపాలపురం టికెట్ ను ఆశించారు. అయితే అధిష్ఠానం అందుకు సమ్మతించలేదు. ఆ తర్వాత 2016లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసిన మద్దిపాటి.. పూర్తిగా టీడీపీ కార్యకర్తగా మారిపోయారు. ఈ క్రమంలో 2019లోనూ ఆయన పార్టీ టికెట్ ఆశించగా నిరాశే ఎదురైంది. అయితే పార్టీలో మద్దిపాటి చేస్తున్న సేవలను గుర్తించిన అధిష్ఠానం లిడ్ క్యాప్ డైరెక్టర్ గా నియమించింది.

ఆపై మరింతగా కష్టపడ్డ మద్దిపాటి టీడీపీ కార్యక్రమాల కమిటీ ఇంచార్జీగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన పనితీరును గుర్తించిన పార్టీ అధినాయకత్వం… మద్దిపాటిని గోపాలపురం నియోజకవర్గ ఇంచార్జీగా నియమించింది. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో గోపాలపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మద్దిపాటి… నాడు హోం మంత్రిగా పనిచేస్తున్న తానేటి వనితను చిత్తుగా ఓడించారు. 26,784 ఓట్ల ఆధిక్యంతో వనితపై మద్దిపాటి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఇదంతా బాగానే ఉన్నా… ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యానన్న సంతోషాన్ని ఎంజాయి చేసే సాటి ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా మద్దిపాటి తన నియోజకవర్గానికి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా మెజారిటీ నిధులు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న మద్దిపాటి చిన్నాచితక పనులకు తన సొంత నిధులను వెచ్చిస్తూ సాగిపోతున్నారు. ప్రస్తుతం గోపాలపురంలో మద్దిపాటి సాగుతున్న స్పీడు చూస్తే దరిదాపుల్లో ఆయనను ఓడించే నేతే లేరన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రజారోగ్యానికే తన ప్రాధాన్యత అని చెబుతున్న మద్దిపాటి తన నియోజకవర్గంలో ఆరోగ్యరంగానికి మరింత మెరుగైన వసతులను జోడించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మద్దిపాటి సేవలతో గోపాలపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే ఓ ఆదర్శ నియోజకవర్గంగా మారాలని మనమూ ఆశిద్ధాం.