ఏపీ రాజకీయాల్లో మరి చిత్రమైన ఘటన తెరమీదకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీని పనిగట్టుకుని ఆకాశానికి ఎత్తుతున్న కూటమి పాలకులు ఒకవైపు అయితే.. నిన్న మొన్నటి దాకా.. తెరచాటు మాత్రమే మద్దతు పలికిన వైసీపీ ఇప్పుడు బహిరంగ వేదికలపై కూడా.. మోడీ నామస్మరణ స్వరాన్ని పెంచింది. వాస్తవానికి టీడీపీ.. బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కాబట్టి.. మోడీనికి పొగడ్డం, కేంద్రం బాగా పనిచేస్తోందని కీర్తించడం సహజమే. కానీ, ఎంత అభిమానం ఉన్నా.. వైసీపీ మాత్రం ఇలా బయట పడడం ఏంటనేది ఆసక్తిగా మారింది.
మొత్తంగా కూటమి పార్టీలతో పాటు వైసీపీ నాయకులు కూడా మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వారు-వీరు అనే తేడా లేకుండా.. మోడీని పొగుడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో తిరుపతి వైసీపీ పార్లమెంటు సభ్యుడు.. డాక్టర్ గురుమూర్తి.. ప్రధానిని ఆకాశానికి ఎత్తేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో కేంద్రప్రభుత్వ 2,313 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన రెండవ దశ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తిరుపతి ఎంపి మద్దెల గురుమూర్తి.. మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం విద్యాభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఐఐటిలో రెండవ దశ పనులు పూర్తయితే మరింత మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలు కలుగుతుందన్నారు. అంతేకాదు.. ప్రధాని మోడీ దార్శనిక నేతృత్వంలో దేశం పురోభివృద్ధి సాధించడం ఖాయమని తెలిపారు. ప్రధానిగా నరేంద్ర మోడీ మరికొన్నాళ్లు పాలన సాగించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. భారత్ విశ్వఖ్యాతి సాధించడానికి ప్రధాని మోడీనే కారణమని తెలిపారు.
ఇక, విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన నాయకత్వం అద్భుతంగా ఉందన్నారు. దేశం సంస్కరణల పథంలో ముందుకు సాగడానికి మోడీనే కారణ మని తెలిపారు. ప్రధాని మోడీ ఉన్నన్నాళ్లు దేశానికి ఎలాంటి ఇబ్బంది లేదన్న ఆయన.. మోడీ పేరును 32 సార్లు పలికారు. ఆయనను 18 సార్లు పొగిడారు. ఆయన నాయకత్వాన్ని 22 సార్లు మెచ్చుకున్నారు. ఇలా.. వారు వీరు అనే తేడా లేకుండా ప్రధానిని ఇలా పొగడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates