‘జూబ్లీ హిల్స్‌’ను ఇలా గెలుద్దాం: కేసీఆర్ వ్యూహం

హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యలో తాజాగా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అనంతరం పార్టీ కీలక నాయకులు, మాజీ మంత్రులతో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? జూబ్లీహిల్స్‌లో ఎలా విజయం దక్కించుకోవాలి? ఎవరెవరిని మచ్చిక చేసుకోవాలి? ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్‌ను ఎలా నిలువరించాలన్న అంశంపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని సూచించారు.

ఈ సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ సహా పార్టీ కీలక నాయకులు హాజరయ్యారు. ఉప ఎన్నికే అయినా చాలా ప్రతిష్టాత్మకంగా పోటీ జరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. “ఎన్నికలంటే ప్రతిష్టాత్మకంగానే జరుగుతాయి. మనం కూడా అలానే పోరాడాలి. ఏ విషయాన్ని లైట్ తీసుకోవద్దు” అని సూచించారు. అంతేకాదు ఎత్తుకు పై ఎత్తు వేసే విషయంలో మరింత యాక్టివ్‌గా ఉండాలని కూడా ఆయన సూచించారు. ముఖ్యంగా కాంగ్రెస్ వేసే ఎత్తులను పసిగట్టాలని తెలిపారు.

నివేదికలు సిద్ధం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో తాను రెండు మూడు సర్వే సంస్థలతో ప్రజల నాడిని పట్టుుకునే ప్రయత్నం చేశానని కేసీఆర్ వివరించారు. ప్రస్తుతం ప్రజల మూడ్ బీఆర్‌ఎస్ వైపే ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విసుగొచ్చిందని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని తెలిపారు.

నివేదికల సారాంశాన్ని బట్టి జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయానికి అత్యంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నారు. (గతంలో కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేల్లో కూడా ఇదే సమాచారం వచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.) అయినప్పటికీ అందరూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని కేసీఆర్ సూచించారు.

అష్టదిగ్భంధనం ఇదీ

మొత్తంగా 8 విధానాలను అనుసరించడం ద్వారా బీఆర్‌ఎస్ గెలిచేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించారు.

  1. రేపటి నుంచే ప్రచారాన్ని ప్రారంభించడం.
  2. ప్రతి ఇంటికీ వెళ్లడం.
  3. గత పాలనలో జరిగిన లబ్ధిని వివరణ చేయడం.
  4. మహిళ అభ్యర్థి సునీత (బీఆర్‌ఎస్ అభ్యర్థి)కు అండగా ఉండాలని చెప్పడం.
  5. ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను వివరించడం.
  6. యువత ఓటు బ్యాంకును పూర్తిగా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మలచడం.
  7. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవడం.
  8. క్యాంపెయినర్లను ముందుగానే సిద్ధం చేసుకుని గల్లీ గల్లీకి వెళ్లడం.