ఏసీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే సింపుల్‌గా ఒక్క విషయం అర్థమవుతుంది. ప్రతి సందర్భంలోనూ గత ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలోని వైఫల్యాలను హైలైట్ చేయటంతో పాటు జగన్ పాలన జరిగిన ఐదేళ్లలో చోటుచేసుకున్న పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు. తాజాగా అలాంటి గతాన్ని సభ ముందుకు తీసుకొచ్చారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.
గత ప్రభుత్వంలో వేధింపులు ఎంత తీవ్రంగా ఉంటాయన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసిన ఆయన, చిన్న విషయాలను సైతం సీరియస్‌గా తీసుకుని కఠిన చర్యలు చేపట్టేవారని వివరించారు. తన స్నేహితుడు ఒకరు వాట్సాప్‌లో తనకు వచ్చిన మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసినందుకు ఆయన ప్రాణాలు పోయేలా చేశారని భావోద్వేగానికి గురయ్యారు.
అప్పట్లో నిబంధనలను పక్కన పెట్టి వ్యవహరించిన అంశాలను ప్రస్తావించారు. కరోనా కాలంలో అమెరికా నుంచి ఫార్వర్డ్ అయిన వాట్సాప్ మెసేజ్ ఒకటి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడైన తన మిత్రుడు నలంద కిశోర్‌కు వచ్చిందని ఆయన చెప్పారు. ‘‘ఫార్వర్డ్ మెసేజ్ కావడంతో ఇతరులకు ఫార్వర్డ్ చేశారు. అయితే ఆ మెసేజ్ ఉత్తరాంధ్ర వైసీపీ ఇంఛార్జిని అవమానించేలా ఉందని సీఐడీ కేసు నమోదు చేసి నా మిత్రుడిని అదుపులోకి తీసుకున్నారు’’ అని పేర్కొన్నారు.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ‘‘కరోనా తీవ్రతను పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం విజయనగరంలో విచారణ చేయొచ్చు. కానీ అలా చేయకుండా విశాఖలో అరెస్టు చేసి కావాలనే ఇరుకైన కారులో కరోనా నిబంధనలను అతిక్రమించి కర్నూలుకు తరలించారు. దీంతో ఆయన కరోనా బారిన పడి మరణించారు’’ అంటూ తన ఆవేదనను పంచుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates