గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో 49 మంది నేరచరితులు పోటీ చేస్తున్నారు. 150 డివిజన్లలో గెలుపోటములు తేల్చుకునేందుకు స్టేట్ ఎన్నికల కమీషన్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 150 డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో 49 మంది నేరచరితులున్నారని బయటపడింది. వీరందరు 41 డివిజన్లలో ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్నారు. పోయిన ఎన్నికల్లో నేరచరితుల సంఖ్య 72 మంది ఉంటే తాజా ఎన్నికల్లో వీరి సంఖ్య తగ్గినా మెజారిటి పార్టీలు నేరచరితులని తెలిసీ టికెట్లివ్వటమే విచిత్రం.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న 49 మంది నేరచరితుల్లో 6 గురు మహిళలు కూడా ఉండటమే ఆశ్చర్యంగా ఉంది. 48 మందిపైనా మొత్తం 96 కేసులున్నాయి. నేరచరితుల్లో అత్యధికంగా బీజేపీ తరపున పోటీ చేస్తుండటం గమనార్హం. మొత్తం మీద 149 డివిజన్లలో పోటీ చేస్తున్న కమలంపార్టీలో 17 మంది నేరచరితులున్నారు. ఇక 51 డివిజన్లలో పోటీ చేస్తున్న ఎంఐఎంలో 7 మంది, 150 డివిజన్లలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ తరపున 13 మంది, 146 డివిజన్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ తరపున 12 మంది నేరచరితులున్నారు.
ఒకవైపు నేరచరితులను చట్ట సభల్లోకి అడుగపెట్టనీయకూడదని సుప్రింకోర్టు మొత్తుకుంటోంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే చట్టసభల్లో ఉన్న నేరచరితులపై నమోదైన కేసులను వెంటనే విచారించమని సుప్రింకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ హైకోర్టులకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కోర్టుల్లో వెంటనే విచారణ సాధ్యం కాదని అనుకుంటే అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కూడా సుప్రింకోర్టు ఆదేశించింది. దీనికి తగ్గట్లే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే ప్రత్యేకంగా నిధులను కూడా విడుదల చేసింది.
సుప్రింకోర్టు తరపున అమికస్ క్యూరీ విడుదల చేసిన లెక్కల ప్రకారం సుమార 4200 మంది తాజా, మాజీ ప్రజా ప్రతినిధులపై నేరచరిత్రుంది. సుప్రింకోర్టు చెప్పినట్లుగా నేరచరిత్ర కలిగిన ప్రజా ప్రతినిధులపై వెంట వెంటనే కేసుల విచారణ జరిగే అవకాశాలు తక్కువే. ఎందుకంటే నేరం చేశారనటానికి అవసరమైన సాక్ష్యులను తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టడం, వారితో సాక్ష్యాలు చెప్పించటం అంత వీజీ కాదు. సరే ఏదేమైనా నేరచరితులను చట్ట సభల్లోకి ప్రవేశపెట్టనీయకూడదన్న సుప్రింకోర్టు ఆలోచన స్వాగతించదగ్గదే. ఒకవైపు ఇదే విషయాన్ని కోర్టులు మొత్తుకుంటుంటే ఇంకోవైపు పార్టీలు అదే పనిగా నేరచరితులకు టికెట్లిస్తుండటమే విచిత్రంగా ఉంది.