తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో శుక్రవారం ఓ కీలక ప్రకటన వెలువడింది. విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సునీత అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. సునీతకే టికెట్ దక్కుతుందని చాలా రోజులుగా అనుకుంటున్నా… శుక్రవారం అధికారిక ప్రకటన రావడంతో ఆ విషయం రూఢీ అయిపోయింది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీని వదిలి బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ టికెట్ దక్కించుకున్న మాగంటి వరుస విజయాలతో దూసుకెళ్లారు. అయితే ఇటీవల జరిగిన బోరబండ కార్పొరేటర్ మృతితో మాగంటి తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురై ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మాగంటి మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే బీఆర్ఎస్ విపక్షంలో ఉండటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ రెండు పార్టీల మథ్యే ప్రదాన పోటీ నెలకొంది. మాగంటి కుటుంబం నుంచి సునీతతో పాటు ఆమె మరిది కూడా టికెట్ ఆశించారు. అయితే అధిష్ఠానం మాత్రం సునీత వైపే మొగ్గుచూపింది. మాగంటి సతీమణిగా సునీతకు సానుభూతి లభిస్తుందన్నది ఓ భావన కాగా… చనిపోయిన ఎమ్మెల్యే భార్యకే టికెట్ ఇచ్చామని, ఇతర పార్టీలు పోటీ నుంచి తప్పుకుని ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న వాదనను వినిపించేందుకు ఈ వ్యూహం పనికి వస్తుందన్నది మరో భావనగా తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates