ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ అనే దేవాలయం లో తాను కేవలం పూజారిని మాత్రమేనని.. ప్రజలే దేవుళ్లని వ్యాఖ్యానించారు. దేవుళ్లకు సేవ చేసుకునేందుకు మాత్రమే ఇక్కడ ఎన్నికైన సభ్యులు పనిచేయాలని సూచించారు. ఇదేసమయంలో వైసీపీ అధినేత జగన్ కోరుతున్నట్టుగా .. ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది దేవుడే ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. పూజారి ఏమైనా ఇవ్వగలడా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జగన్ అర్ధం చేసుకోవాలని సూచించారు.
“అసెంబ్లీకి రాకుండా జగన్ మారాం చేస్తున్నారు. ఆయన వైఖరిని ప్రజలు గమనించాలి. నేనేదో తప్పు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది సరికాదు. నేను పూజారిని మాత్రమే. ప్రజలే దేవుళ్లు. నాకైనా మీకైనా.. జగన్‌కైనా వారే అవకాశం కల్పించారు. దీనిని సద్వినియోగం చేసుకునే బాధ్యత జగన్‌పైనే ఉంది. పూజారి ఏం చేయగలడు? దేవుడు వరమిస్తే.. పూజారి ఆపగలడా? చెప్పండి.” అని స్పీకర్ వ్యాఖ్యానించారు. కాబట్టి.. జగన్ సభకు వచ్చి ప్రజల సమస్యలపై స్పందించాలి. ప్రశ్నించాలి. తన నియోజకవర్గానికి అయినా న్యాయం చేయాలని వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా డుమ్మా కొడుతున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై వైసీపీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తోంది. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని.. సభలో మరో పార్టి ప్రతిపక్షంగా లేనప్పుడు.. తమకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నదివైసీపీ అధినేత చెబుతున్న మాట. అప్పుడు తమకు సీఎంతో సమానంగా మాట్లాడేందుకు అవకాశం లభిస్తుందని అంటున్నారు. అలా …. ఇవ్వనంత వరకు తాము సభకు వచ్చేది లేదని చెప్పుకొచ్చారు.
ఈ విషయంపై వైసీపీ సభ్యుడు ఒకరు సభలో లిఖిత పూర్వక ప్రశ్న సంధించారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం హోదా ఇచ్చే ఆలోచన ఉందా? లేదా? అని ప్రశ్నించారు. దీనిపై మరోసారి అయ్యన్న పాత్రుడు స్పందించారు. అవకాశం లేదని తేల్చి చెప్పారు. తాను ఏమీ చేయలేనని అయ్యన్న వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వైసీపీ అధినేత తనపై దేశంలోని ఏ కోర్టుకు వెళ్లినా ఫర్వాలేదన్న అయ్యన్న.. చట్టం, న్యాయం ప్రకారమే తాను నడుచుకుంటానని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates