హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రాజెక్ట్‌పై నెలల తరబడి కొనసాగిన చర్చలు ఇప్పుడు క్లైమాక్స్‌కి చేరాయి. ఎల్‌అండ్‌టీ పూర్తిగా వెనక్కి తగ్గడంతో, మొత్తం ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోంది. ఈ క్రమంలో దాదాపు రూ.13 వేల కోట్ల అప్పును ప్రభుత్వం టేకోవర్ చేయడానికి అంగీకరించింది. అంతేకాకుండా ఎల్‌అండ్‌టీకి రూ.2,100 కోట్లు నగదు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. దీంతో మెట్రో నిర్వహణలో ప్రైవేట్ రంగం పాత్ర ముగిసిపోగా, ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోనుంది.
మొదటి దశలో 69 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగిన మెట్రో ప్రాజెక్ట్ అప్పట్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.22 వేల కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంది. అయితే లాభాలు రాకపోవడంతో పాటు అప్పు భారంతో ఎల్‌అండ్‌టీ ఇంతకాలం ఇబ్బంది పడింది. ఇక రెండో దశలో భాగస్వామ్యం సాధ్యం కాదని ఆ సంస్థ స్పష్టం చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 1ని స్వాధీనం చేసుకోక తప్పట్లేదు.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో దేశవ్యాప్తంగా తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా 163 కిలోమీటర్ల ఫేజ్ 2A, 2B లైన్ల ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం ఏమందంటే.. “మొదటి దశ ప్రైవేట్ చేతుల్లో ఉండగా, రెండో దశ ప్రభుత్వమే చేపడితే ఆపరేషనల్ ఇన్టిగ్రేషన్ క్లిష్టం అవుతుంది” అని తెలిపింది. దీంతోనే ఎల్‌అండ్‌టీని ఒప్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు సమావేశాలు జరిపారు. ఫైనల్ గా ఆ సంస్థ వెనక్కి తగ్గింది.
ఈ టేకోవర్ తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2 మెట్రో లైన్లను ఏకీకృతంగా నిర్వహించేందుకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పాతబస్తీ ప్రాజెక్టు పనులు ఇప్పటికే వేగం పుంజుకున్నాయి. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 5.5 కి.మీ. లైన్‌లో పిలర్ మార్కింగ్, రోడ్ వెడల్పు పనులు జరుగుతున్నాయి. 1,100 ఆస్తుల బదులు ఇంజనీరింగ్ మార్పులతో 900 ఆస్తులు మాత్రమే ప్రభావితం అయ్యేలా మార్గరేఖలు సవరించారు.
హైదరాబాద్ మెట్రో భవిష్యత్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందుకు సాగే అవకాశం ఖాయం కావడంతో పౌరులు సానుకూలంగా చూస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో నగర ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు తగ్గుతాయని, పాతబస్తీ సహా కొత్త ప్రాంతాల్లో మెట్రో విస్తరణ పథకాలు వేగవంతం అవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ టేకోవర్ నిర్ణయం నిజంగా మెట్రో ప్రయాణానికి కొత్త దశను ఆరంభించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates