టీడీపీ లేని చోట కూడా పుంజుకోలేక పోతున్న వైసీపీ ఎక్క‌డంటే!

ప్ర‌త్య‌ర్థి బ‌లంగా ఉన్న చోట‌.. ఏ నాయ‌కుడైనా పుంజుకోవ‌డం స‌మ‌యం తీసుకుంటుంది. అస‌లు ప్ర‌త్య‌ర్థే లేని చోట‌.. అందునా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ బ‌లంగా దూసుకుపోయే ప‌రిస్థితి లేని చోట‌.. అధికార ప‌క్షం ఎలాంటి దూకుడు ప్ర‌ద‌ర్శించాలి? ఎలా వ్య‌వ‌హ‌రించాలి? అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఏముంటుంది? అయినా కూడా అధికార ప‌క్షంలో దూకుడు క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌కాశం జిల్లాలోని ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం ఎర్ర‌గొండ‌పాలెం. ఇక్క‌డ ప్ర‌స్తుతం టీడీపీ ప‌రిస్థితి జెండా మోసేవారు క‌నిపించ‌డం లేదు. ఉన్న‌వారి లోనూ ఎవ‌రికీ చంద్ర‌బాబు నుంచి క్లారిటీ లేక‌పోవ‌డంతో నాయ‌కులు మౌనం పాటిస్తున్నారు.

ఎర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం సాధించిన ఆయ‌న త‌ర్వాత జ‌గ‌న్‌కు జై కొట్టారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఇక్క‌డ టికెట్ ఇచ్చారు. సురేశ్ గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, ఎస్సీ కోటాలో జ‌గ‌న్ ఆయ‌న‌కు విద్యాశాఖ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఆయ‌న ప‌ని ఆయ‌న చేసుకుని పోతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. పార్టీ ప‌రంగా చూసుకుంటే.. సురేశ్ ఎక్క‌డా ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌డం లేదు. ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌లు మాత్రం చూస్తున్నారు. దీంతో ఇక్క‌డి వైసీపీ నాయ‌కులు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం.. మంత్రి బాలినేని చుట్టూ తిరుగుతున్నారు.

వాస్త‌వానికి టీడీపీకి ఇక్క‌డ బ‌లం లేద‌నే చెప్పాలి. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో 2014, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున బుడాల అజితారావు పోటీ చేశారు. అయితే, రెండు ఎన్నిక‌ల్లో ఓట‌మి దెబ్బ‌తో అజితారావు దూర‌మ‌య్యారు. ఏకంగా పార్టీలోనూ జాడ క‌నిపించ‌డం లేదు. దీంతో ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని స‌మ‌న్వ‌యం చేసేవారు లేక టీడీపీ అల్లాడుతోంది. ఇటీవ‌ల డాక్ట‌ర్ రవీంద్ర‌, క‌రిముల్లా వంటి యువ నేత‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి ఇక్క‌డ ఎలాంటి ప్రాతినిధ్యం ఉండ‌దు. ఇది ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఆ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు అయితే.. గ‌ట్టిగా నిల‌దొక్కుకునేందుకు, పార్టీని పరుగులు పెట్టించేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఈ క్ర‌మంలో టీడీపీలో ఉన్న ఈ లోటును త‌న‌కు అనుకూలంగా మార్చుకుని వైసీపీని ప‌రుగులు పెట్టించ‌డంలో మంత్రి సురేష్ ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే, దీనికి ఆయ‌న చెబుతున్న వాద‌న ఏంటంటే.. గ‌తంలో ఇలానే అనుకుని కేడ‌ర్ను పెంచిపోషించాన‌ని, తీరా ఎన్నిక‌లు వ‌చ్చే స‌రికి నియోజ‌క‌వ‌ర్గం మార్చేశార‌ని.. ఏ నిముషానికి ఏం జ‌రుగుతుందో ఎవ‌రికి తెలుసు.. నా ప‌ని నేను చేసుకుని పోతే చాలు! అని నిమ్మ‌కుంటున్నారు. దీంతో పుంజుకునే అవ‌కాశం ఉండి కూడా పార్టీ పుంజుకోవ‌డం ల‌దేని అంటున్నారు ప‌రిశీల‌కులు.