బీజేపీ నాయకుడు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు.. వరుసగా రెండో సారి సీఎం చంద్రబాబు నుంచి అభినందనలు దక్కాయి. ‘శభాష్ సత్య’ అంటూ.. మంత్రి సత్యకుమార్‌కు సీఎం ఫోన్ చేసి మరీ అభినందించారు. గతంలో కూడా.. ఒకసారి మంత్రిని చంద్రబాబు అభినందించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఆయన.. ప్రభుత్వ వైద్య శాలలను సందర్శించి.. లోపాలను ఎత్తి చూపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వైద్య శాలల దుస్థితిని కళ్లకు కట్టారు. ఆ సమయంలో చంద్రబాబు సత్యకుమార్‌ను అభినందించారు.
మంత్రి వర్గంలోనే సత్యకుమార్ కృషిని.. ఆయన చేస్తున్న కార్యక్రమాలను కూడా చంద్రబాబు ప్రశంసించారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఆయనను అభినందించారు. దీనికి కారణం.. బుధవారం నాటి శాసన మండలి సమావేశాలలో సత్యకుమార్ చెలరేగి మాట్లాడడమే!. వైసీపీ హయాంలో తీసుకువచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ-ప్రైవేటు-పార్టనర్‌షిప్(పీపీపీ) కింద కేటాయిస్తుండడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ.. వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండలిలో స్పందించారు.
ఏకంగా 2 గంటల పాటు సుదీర్ఘంగా ప్రసంగించిన మంత్రి.. వైసీపీ హయాంలో వచ్చిన 17 మెడికల్ కాలేజీల దుస్థితిని.. వాటికి కేటాయించిన నిధులను కూడా సభా వేదికగా స్పష్టం చేశారు. ఇదేసమయంలో రాజకీయంగా వైసీపీని తూర్పారబట్టారు. ప్రతి జిల్లాలోనూ ఇంద్ర భవనాలను తలపించే విధంగా పార్టీ కార్యాలయాలను కట్టుకున్నారన్న ఆయన.. మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం ఎందుకు ఆ మేరకు శ్రద్ధ చూపించలేక పోయారని నిలదీశారు. ఇదేసమయంలో రుషికొండ ప్యాలెస్ విషయాన్ని ప్రస్తావించారు.
అదేవిధంగా.. పీపీపీకి-ప్రైవేటీకరణకు తేడా తెలియని ముఖ్యమంత్రి అంటూ.. జగన్‌ను వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. అదేసమయంలో వైసీపీ చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన మంత్రి.. కాలక్షేపం కోసం.. ఎన్నో చెబుతున్నారని అన్నారు. తమ హయాంలో ఈ 15 మాసాల్లో చేసిన అభివృద్ది, ఆయా కాలేజీలకు కేటాయించిన నిధులను కూడా వివరించారు. ఇలా.. అటు వైసీపీని విమర్శిస్తూ.., ఇటు ప్రభుత్వాన్ని హైలెట్ చేస్తూ.. సత్య ప్రసంగించడంతో వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన సీఎం చంద్రబాబు.. శభాష్ సత్య.. అని ఫోన్ చేసి అభినందించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates