భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబుపై ఏపీ ప్రజలకు చాలా నమ్మకం ఉందని.. ఆయన విజన్‌పట్ల ఎంతో మందికి మక్కువ ఉందని అన్నారు. భారత ఉపరాష్ట్రపతిగా ఈ నెల 9న ఘన విజయం దక్కించుకున్న సీపీ రాధాకృష్ణన్.. తొలిసారి బుధవారం ఏపీ పర్యటనకు వచ్చారు. సీఎం చంద్రబాబు సహా మంత్రి నారా లోకేష్ ఆయనకు విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం.. తొలుత సాయంత్రం ఆయన ఇంద్రకీలాద్రిపై ఉన్న బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ బుధవారం అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శమిచ్చింది. ఆమెను కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఉపరాష్ట్రపతి.. ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం.. విజయవాడలోని భవానీ ఘాట్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులు.. ఇక్కడ జరుగుతున్న `విజయవాడ ఉత్సవ్`ను తిలకించారు. అనంతరం.. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రజలు చంద్రబాబుపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతోపాటు పెట్టుబడులు కూడాసాధిస్తారని విశ్వసిస్తున్నారని తెలిపారు. ప్రజల నమ్మకం మేరకు చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను అందిస్తోందన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఎంతో భవిష్యత్తు ఉందని తెలిపారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం దూసుకువెళ్తోందని చెప్పారు. భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు.
ఇక, విజయవాడ నగరంపైనా ఉపరాష్ట్రపతి పలుకీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా ఉందన్న ఆయన.. విజయవాడ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఎటు చూసినా.. పచ్చని అందాలు కనిపించాయని తెలిపారు. పక్కనే కృష్ణానది ఉండడం మరింతశోభాయమానంగా ఉందన్నారు. అయితే.. విజయవాడ హాట్ సిటీ అని చమత్కరించారు. వేసవిలో ఇక్కడ భారీ ఎండలు ఉంటాయని.. చెప్పారు. కానీ, ఇక్కడిప్రజలు మాత్రం చాలా కూల్‌గా ఉంటారని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. చంద్రబాబు విజన్‌తో రాష్ట్రం వికసిత్ ఏపీగా మారనుందన్నారు. ఇక్కడి వారి సంప్రదాయాలు చాలా గొప్పవని తెలిపారు.
తిరుమలకు..
విజయవాడ పర్యటన అనంతరం.. ఉపరాష్ట్రపతి తిరుపతికి వెళ్లారు. తిరుమలలో బుధవారం రాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. శ్రీవారి వాహన సేవల్లోనూ ఆయన పాల్గొంటారు. కాగా.. తొలిసారి రాష్ట్రానికి వచ్చిన రాధాకృష్ణన్‌కు పలువురు నాయకులు.. అభినందనలు తెలిపారు. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వానం మేరకు.. తాను వచ్చానని రాధాకృష్ణన్ చెప్పడంతో ఆయన పొంగిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates