ఏపీ శాసన మండలిలో మంగళవారం ఆసక్తికర సంభాషణ, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. జీఎస్టీ 2.0 సంస్కరణలకు ఏపీ అసెంబ్లీ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై తీర్మానం కూడా చేశారు. తాజాగా దీనిని మండలిలో మంగళవారం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా అధికార పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే దీనిపై వైసీపీ సభ్యులు మాట్లాడే సమయంలో వారు తీర్మానాన్ని ఆమోదిస్తున్నారో లేదో చెప్పాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న వైసీపీ మండలి పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ సూటిగా సమాధానం చెప్పకుండా జీఎస్టీ దేశమంతా అమలవుతోందని, ఒక్క ఏపీలోనే కాదని అన్నారు. కానీ ఎక్కడా లేని విధంగా ఇక్కడే దీనిపై తీర్మానం చేశారని వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనూ పయ్యావుల బొత్సను మరోసారి మీరు ఈ తీర్మానాన్ని సూటిగా ఆమోదిస్తున్నారా అని ప్రశ్నించారు. అప్పుడు కూడా బొత్స సమాధానం దాట వేసి తనదైన ధోరణిలోనే ప్రసంగం కొనసాగించారు.
మరోసారి జోక్యం చేసుకున్న పయ్యావుల మాట్లాడుతూ.. మీరు ఈ తీర్మానాన్ని (జీఎస్టీ) ఆమోదిస్తారు. ఎందుకంటే మీరు దీనిని ఆమోదించకపోతే మీకు, మీ నాయకుడికి ఎక్కడ నుంచి (ఢిల్లీ పెద్దల) ఫోన్ వస్తుందో నాకు తెలుసు. ఇక్కడ తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలోనే మీ నాయకుడు జీఎస్టీని ఆకాశానికి ఎత్తేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనంతరం దీనిని సభ ఆమోదించినట్టుగా చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
అయితే ఈ సమయంలోనూ పయ్యావుల కేశవ్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు తమ అభిప్రాయాన్ని సంపూర్ణంగా చెప్పకుండానే తీర్మానం ఆమోదం పొందిందని ఎలా ప్రకటిస్తారని చైర్మన్‌ను నిలదీశారు. మీరు వైసీపీ సభ్యులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే చైర్మన్ మాత్రం మౌనంగా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు ప్రకటించి సభకు లంచ్ బ్రేక్ ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates