ప్రపంచీకరణ(గ్లోబలైజేషన్) అనేది.. 1990ల నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పుడు ప్రతి దేశం జపిస్తున్న మాట కూడా. అయితే.. ఒకప్పుడు ప్రపంచీకరణ అనేది దేశాలకు- దేశాలకు మధ్య అనుసంధానం పెంచింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను కూడా విస్తరించింది. అందుకే.. మన దేశంలో పీవీ నరసింహారావు ప్రధానిగా వచ్చిన తర్వాత.. సంస్కరణల పేరుతో ఆయన గ్లోబలైజేషన్‌కు ద్వారాలు తెరిచారు. ఇక, ఆ తర్వాత తర్వాత.. అనేక మార్పులు వచ్చాయి. ఈ సంస్కరణలు ఎందాకా వెళ్లాయంటే.. ఇంట్లో మనం వినియోగించే చాలా వస్తువులు ఏదేశంలో తయారయ్యాయో కూడా తెలియనంతగా ప్రపంచీకరణకు ద్వారాలు తెరిచారు.
చిత్రం ఏంటంటే.. మనం వాడే పేస్టుల్లో చాలా వరకు అమెరికా సహా ఇతర దేశాల్లో తయారవుతాయి. కోల్‌గేట్ అమెరికాలో తయారవుతున్న విషయం చాలా మందికి తెలియదు. ఇలా.. మనకు.. ఇతర దేశాలకు మధ్య అవినాభావ సంబంధం పెరిగిపోయింది. దేశంలో ఎక్కడైనా వరదలు విపత్తులు వచ్చి ఉల్లిపాయలు, బంగాళా దుంపలకు లోటు వస్తే.. పాకిస్థాన్ సహా.. ఇతర అరబ్ దేశాల నుంచి దుంపలను దిగుమతి చేసుకుంటున్నాం. ఇతర దక్షిణాప్రికా దేశాల నుంచి ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకుంటున్నాం. ఇక, ఇంగువ మన దేశ సరుకు కాదన్న విషయం చాలా మందికి తెలియదు. ఇప్పటికీ ఇంగువ ఫారిన్ సరికే.
కట్టుకునే బట్టల నుంచి తినే సరుకుల వరకు ప్రపంచ దేశాలతో ముడిపడిపోయిన ఈ ‘బంధం’ తెంచాలన్నది ప్రధాన మోడీ ప్రయత్నం. అందుకే ఆయన.. తొలిసారి వృత్తి నిపుణులను ‘నాగరిక్ దేవోభవ’ అని వ్యాఖ్యానించారు. తద్వారా.. ప్రపంచ దేశాల దూకుడుకు ముఖ్యంగా అమెరికాకు ముకుతాడు వేయాలన్నది మోడీ వ్యూహం. సుంకాలు, వీసాల ద్వారా అమెరికా ఒకరకంగా అతి పెద్ద జనాభా ఉన్న భారత్‌పై దాడి చేస్తోందన్నది వాస్తవం. ఈ క్రమంలో ఆ దేశాన్ని కట్టడి చేసే క్రమంలోనే మోడీ ఈ నిర్ణయాలు తీసుకున్నారా? అనేది చూడాలి. ఇక, చైనా కూడా మన దేశంలో చాలా విస్తరించింది(వ్యాపార పరంగా). ఇప్పుడు స్వదేశీ మంత్రంతో ఈ దేశానికి కూడా చెక్ పెట్టాలని నిర్ణయించారు.
మంచిదేనా?
అయితే.. ప్రస్తుతం మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదేనా? స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్న దానిలో ఎంత వరకు కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది? అనేది కీలకం. ఎందుకంటే.. ఉత్పత్తులు పెరిగిపోతే.. వినిమయం-డిమాండ్‌పైతీవ్ర ప్రభావం పడుతుంది. అదేసమయంలో ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయాల్సి ఉంటుంది. అయితే..మనం కొననప్పుడు.. ఇతర దేశాలు మన ఉత్పత్తులను కొనుగోలు చేస్తాయా? అన్నది ప్రధాన ప్రశ్న. అంతేకాదు.. ‘ప్రపంచీకరణ’కు స్వదేశీ ఉత్పత్తుల ద్వారా మోడీ పరోక్షంగా చెక్ పెడుతున్నారు.
ఇది అంతర్జాతీయంగా పెను వివాదానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఈ వివాదాలు రాకపోయినా.. త్వరలోనే భారత్‌లో స్వదేశీ ఉత్పత్తులు పెరిగి, అంతర్జాతీయంగా కొనుగోలు ఆగితే.. ఖచ్చితంగా అది భారత్‌పై మరోరూపంలో యుద్ధానికి కారణమవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అతి చేసి.. ఇప్పుడు అనూహ్యంగా తప్పుకోవడం ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates