కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. వైయస్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే ఆమె అసలైన కాంగ్రెస్ వాదిగా తనను తాను ప్రాజెక్టు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమం, పేదల పక్షపాతిగా ఉన్నారని ఆమె చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైయస్ రాజశేఖర్ రెడ్డిని రెండవసారి అధికారంలోకి తీసుకువచ్చేలా చేసిన కీలకమైన పథకం ఆరోగ్యశ్రీ. ఈ పథకమే లేకపోతే 2009లో తను రెండోసారి విజయం సాధించే వాడిని కాదని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. దీనిని బట్టి ఆరోగ్యశ్రీకి వైయస్ ఇచ్చిన ప్రాధాన్యం ఎంత అనేది అర్థమవుతుంది.
ఇక వైయస్ మరణం తర్వాత ప్రభుత్వాలు అనేకం మారాయి. అయినా.. అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ ఈ పథకాన్ని మాత్రం అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేకుండా రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఊహించలేనంత పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీని అటకేకిస్తున్నారన్న చర్చ నడుస్తుంది. ఏపీలో అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం ఆ ప్రభుత్వ విధానాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. దాని ప్రకారం అమలు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆరోగ్యశ్రీని అటకెక్కించినా లేకపోతే ఆరోగ్యశ్రీలో మార్పులు చేసినా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పేందుకు అవకాశం ఉంటుంది.
కానీ, తెలంగాణకు వచ్చేసరికి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పైగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతిని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపి వేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకంలో 25 లక్షల రూపాయల వరకు పేదలకు లబ్ధి చేకూర్చేలా బీమాను ఏర్పాటు చేశారు. దీనిని అందిపుచ్చుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో అటు ఆరోగ్యశ్రీ ఇటు ఆరోగ్య బీమా రెండు పెట్టుకుని ప్రభుత్వంపై భారం పడే బదులు ఆరోగ్యశ్రీని నెమ్మదిగా పక్కకు తప్పించేయటమే బెటర్ అనే ఉద్దేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోంది.
ఇక ఏపీలో ఇప్పటికే ఆరోగ్యశ్రీని దాదాపు తగ్గించాలనే ప్రయత్నంలో ఉన్నారు. పేదలకు రెండున్నర లక్షల ఆరోగ్య భీమా ప్రాథమికంగా కల్పిస్తున్నారు. అదే, ఆయుష్మాన్ భారత్ అయితే 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య భీమా కలుగుతుందని చెబుతున్నారు. ఇన్ని జరుగుతుంటే షర్మిల ఇప్పటివరకు ఆరోగ్యశ్రీపై నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఏపీ సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీని పక్కన పెడుతున్నారని, ఆసుపత్రులకు మూడు వేల కోట్ల రూపాయల బకాయిలను ఇప్పటివరకు చెల్లించలేదని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నప్పటికీ షర్మిల ఇంతవరకు నోరు విప్పలేదు.
ఆమె నోరు విప్పి మాట్లాడితే సొంత ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారన్న వాదన బలపడే అవకాశం ఉంది. పోనీ, ఏపీకి వచ్చి ఏపీలో అయినా మాట్లాడాలని అనుకుంటే గత వైసిపి హయంలోనే రెండు వేల కోట్ల రూపాయలు పైగా బకాయి పెట్టారని, అప్పుడు ప్రశ్నించని షర్మిల ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారు అనే వాదన వినిపిస్తుంది. పైగా ఏపీలో నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో అటు ఏపీ విషయాన్ని ఇటు తెలంగాణ విషయాన్ని కూడా చర్చించలేని పరిస్థితి, ప్రశ్నించలేని పరిస్థితి కూడా షర్మిలకు ఏర్పడిందన్న వాదన బలంగా వినిపిస్తుండడం విశేషం. దీనిని రాజకీయంగా ఆమె ఆయుధంగా మలుచుకోలేకపోతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. చివరకు ఏం జరుగుతుందనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates