మోడీ హ‌యాంలో దేశం అప్పుల పాలు: కాగ్

కేంద్రంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పాల‌న ప్రారంభించి 11 ఏళ్లు అయ్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా బీజేపీ నాయ‌కులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నారు. స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థ కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్‌) శ‌నివారం సంచ‌ల‌న నివేదిక‌ను విడుద‌ల చేసింది. ప్ర‌ధానిగా మోడీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన 10 సంవ‌త్స‌రాల్లో దేశంలో అప్పులు ఏ విధంగా పెరిగిపోయాయో పూస గుచ్చిన‌ట్టు వివ‌రించింది. అంతేకాదు.. 2014 నుంచి రాష్ట్రాలు దైనందిన ఖ‌ర్చుల కోసం కూడా అప్పులు చేసుకునే ప‌రిస్థితికి దిగ‌జారిపోయిన‌ట్టు కాగ్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

నివేదిక‌లో ఏముంది?

దేశంలోని అన్ని రాష్ట్రాల అప్పులు గ‌త‌ దశాబ్దంలో మూడు రెట్లు పెరిగాయ‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది. 28 రాష్ట్రాల మొత్తం ప్రభుత్వ అప్పు 2013-14లో రూ. 17.57 లక్షల కోట్లు ఉండ‌గా.. 2022-23 నాటికి అంటే ప‌దేళ్ల‌లో రూ.59.60 లక్షల కోట్లకు పెరిగాయ‌ని వివ‌రించింది. అంటే పదేళ్లలో అప్పు 3.3 రెట్లు అప్పులు పెరిగాయ‌ని, ఇదేస‌మ‌యంలో రాష్ట్రాల ఆర్థిక ఉత్పత్తిలో ఎక్కువ వాటాను కోల్పోయాయ‌ని పేర్కొంది. అదేస‌మ‌యంలో స్థూల రాష్ట్ర ఉత్పత్తితో పోలిస్తే, అప్పు 2013-14లో 16.66 శాతం నుండి 2022-23 నాటికి దాదాపు 23 శాతానికి పెరిగింద‌ని తెలిపింది.

అయితే.. ఈ అప్పులు రాష్ట్రానికి ఒక విధంగా ఉన్నాయ‌ని కాగ్ వివ‌రించింది. 2023 చివరి నాటికి, పంజాబ్ అత్యధిక రుణం 40.35 శాతం నమోదు చేసిందని, తరువాత స్థానంలో ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ 37.15 శాతం, పశ్చిమ బెంగాల్ 33.70 శాతం అప్పులు చేశాయ‌ని వివ‌రించింది. అయితే.. ఒడిశా మాత్రం అప్పుల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించిన‌ట్టు కాగ్ తెలిపింది. ఈ రాష్ట్ర అప్పులు 8.45 శాతం వద్ద ఉన్నాయ‌ని వివ‌రించింది. ఇక‌, బీజేపీ పాలిత‌ మహారాష్ట్ర 14.64 శాతం, గుజరాత్ 16.37 శాతం అప్పులు పెరిగాయ‌ని వివ‌రించింది. మొత్తంమీద, ఎనిమిది రాష్ట్రాలు జీఎస్‌డీపీలో(రాష్ట్ర స‌గ‌టు ఆదాయం) 30 శాతం కంటే ఎక్కువ రుణాలు చేసిన‌ట్టు తెలిపింది. రాష్ట్రాల మొత్తం అప్పు భారతదేశ జీడీపీలో 22.17 శాతానికి సమానమ‌ని(రూ. 268.9 లక్షల కోట్లు) కాగ్ పేర్కొంది.

రోజు వారీ ఖ‌ర్చుల‌కూ అప్పులే..

ఏపీ స‌హా ప‌లు రాష్ట్రాలు రోజువారీ ఖ‌ర్చుల కోసం కూడా అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని కాగ్ పేర్కొంది. రుణ నిబంధ‌న‌లు కూడా కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘించిన‌ట్టు నివేదిక వివ‌రించింది. దీని ప్రకారం ప్రభుత్వాలు త‌మ రోజు వారీ ఖర్చులకు నిధులు సమకూర్చకూడదు. పెట్టుబడి కోసం మాత్రమే అప్పులు సేకరించాలి.

కానీ, 2023లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, తమిళనాడు సహా 11 రాష్ట్రాలు రోజు వారీ ఖ‌ర్చుల‌కు కూడా అప్పులు చేశాయ‌ని కాగ్ పేర్కొంది. ఈ క్ర‌మంలో రాష్ట్రాల బాండ్లు, ట్రెజరీ బిల్లులు వంటి మార్కెట్ సెక్యూరిటీలు, బ్యాంకుల నుండి రుణాలు పొందాయ‌ని తెలిపింది. ఇక‌, ఆర్బీఐ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఎల్ ఐసీ, నాబార్డ్ వంటి ఆర్థిక‌ సంస్థల నుండి కూడా అప్పులు తీసుకున్న‌ట్టు వివ‌రించింది.