బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఆ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన కవిత విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇంటి ఆడబిడ్డపై నలుగురు కలిసి దాడి చేశారు” అని అన్నారు. అయినా.. కవిత వ్యవహారం రాజకీయాలకు సంబంధించిన విషయం కాదన్న ఆయన, కేవలం కుటుంబం, ఆస్తికి సంబంధించిన విషయమేనని తేల్చి చెప్పారు. కుటుంబ వ్యవహారంతో రాష్ట్ర ప్రజలకు, ఇతర పార్టీలకు ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం ఎప్పుడో బహిష్కరించిందని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ అనే మాట ‘గతం’ అని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎప్పుడో ఆయనను మరిచిపోయారని తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. పలు అంశాలను ప్రస్తా వించారు. ప్రధానంగా ఎమ్మెల్యేల జంపింగుల విషయంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బీఆర్ఎస్‌కు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు? అంటే.. ఆ విషయంలో ఆ పార్టీనే కాకిలెక్కలు చెబుతోంది. కేటీఆర్ ఒకటి చెబుతాడు.. హరీష్ రావు ఇంకోటి చెబుతాడు. ఏది నిజం. 37 మంది ఉన్నారని కేటీఆర్ అంటడు. కానీ, ఇంకోటి ఎక్కువ చేసి హరీష్‌రావు చెబుతడు. ఆ పార్టీకే క్లారిటీలేదు.” అని రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాదు.. తన ఇంటికి వచ్చిన వారికి తాను కండువా కప్పానని.. అంత మాత్రాన వారు పార్టీలో చేరిపోయినట్టేనా? అని వ్యాఖ్యానించారు. ఇదో పని, పాట లేని కార్యక్రమం అని అన్నారు.
ఇక, కాళేశ్వరం విషయంపై బీజేపీని తప్పుబట్టారు. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి సంజయ్ అనేక పోసుగోలు కబుర్లు చెప్పాడన్న ఆయన.. దీనిని సీబీఐకి అప్పగిస్తే.. 48 గంటల్లోనే రంగంలోకి అధికారులను దింపేలా చేస్తానని చెప్పారని, కానీ, రోజులు గడిచినా ఇప్పటి వరకు దీనిపై పన్నెత్తు మాట మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు-కిషన్‌రెడ్డికి మధ్య డీల్ కుదిరిందన్న రేవంత్ రెడ్డి.. ఆ క్రమంలోనే సీబీఐని వేయాలని చెప్పినా.. ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. కేటీఆర్‌కు, కిషన్ రెడ్డికి మధ్య ‘జిగిరీ దోస్త్’ ఉందని వ్యాఖ్యానించారు. అయినా.. తాము ఊరుకునేది లేదన్నారు. సీబీఐని వెంటాడుతామని చెప్పారు.
లోకేష్ తమ్ముడైతే..
ఇదేసమయంలో ఏపీ మంత్రి నారా లోకేష్‌పై బీఆర్ఎస్ కీలక నాయకుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. లోకేష్‌తో ఎందుకు కలిశారని తాను ప్రశ్నిస్తున్నానన్నారు. అది కూడా చీకట్లో ఎందుకు కలవాల్సి వచ్చిందన్నారు. గతంలో లోకేష్‌ను తమ్ముడు అని చెప్పిన కేటీఆర్..తమ హయాంలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు.. ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో నిరసన చేపట్టారని గుర్తు చేశారు. ఆ సమయంలో తమ్ముడి బాధ గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు ఐటీ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలు మరిచిపోయావా? అని ప్రశ్నించారు. ఇక, తను చేసిన వ్యాఖ్యలకు, నారా లోకేష్‌కు సంబంధం లేదన్నారు. రాజకీయంగా అనేక అంశాలపై మాట్లాడుతుంటామని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates