మార్షల్స్ పై లోకేష్ ఆగ్రహం.. రీజనేంటి?

అసెంబ్లీ మార్షల్స్ పై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రస్తుతం ఉన్నది వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నారా?” అని ఆయన ప్రశ్నించారు.

అంతేకాదు, మార్షల్స్ హెడ్‌ను తన కార్యాలయానికి రావాలని కూడా సూచించారు. దీంతో మార్షల్స్ హెడ్ ఆయనను కలిసి వివరణ ఇచ్చారు. ఇక నుంచి ఇలాంటివి జరగబోవని హామీ ఇచ్చారు. అయితే ఇక నుంచి ఈ ఘటనలు రిపీట్ అయితే సహించేది లేదని నారా లోకేష్ తేల్చిచెప్పారు.

ఏం జరిగింది?

గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు మంత్రి నారా లోకేష్ వచ్చారు. ఈ సమయంలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు ఆహ్వానం పలికారు. మరికొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను ఆయనకు వివరిస్తూ మాట్లాడటానికి ప్రయత్నించారు.

ఈ సమయంలో ఎమ్మెల్యేల‌ను దూరంగా ఉండాలని పలువురు మార్షల్స్ సూచించారు. అయితే ఎమ్మెల్యేలు వారి మాట వినకపోవడంతో మంత్రిని చుట్టుముట్టారు. ఈ సమయంలో కొందరు మార్షల్స్ అతిగా ప్రవర్తించారు. ఒక ఎమ్మెల్యేను చేయి పట్టుకుని వెనక్కి లాగేశారు.

ఈ ఘటనతో ఉలిక్కిపడిన మంత్రి నారా లోకేష్ మార్షల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఇప్పుడున్నది వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.
“ఎమ్మెల్యేలు మంత్రులను కలవకపోతే మరెవరిని కలుస్తారు?” అని ఆయన వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలోకి అర్హతలేని బాహ్యులను అడ్డుకోవాలని, కానీ ఎమ్మెల్యేల‌ను కాదు అని స్పష్టం చేశారు. ఇక నుంచి ఇలాంటి విషయాలు జరగడానికి వీల్లేదని హెచ్చరించారు. అనంతరం మార్షల్స్ హెడ్‌ను తన చాంబర్‌కు పిలిచి ఇదే విషయాన్ని మళ్లీ ప్రస్తావించారు.