హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల చివరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార, ప్రతిపక్షాలు.. ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. మరీ ముఖ్యంగా తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకుండా ఒడిసి పట్టుకోవాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇక, ఏడాదిన్నర పాటు సాగించిన తమ పాలనకు ఈ ఉప ఎన్నిక దర్పణం పడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ నాయకులు కూడా ఈ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
మరోవైపు.. బీజేపీ సరేసరి!. మోడీ ప్రభావాన్ని చూపించి.. ఇక్కడ విజయం దక్కించుకునేందుకు ఆ పార్టీ నాయకులు కూడా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఈ మూడు పార్టీల సంగతి ఎలా ఉన్నా.. బీఆర్ఎస్‌లో మాత్రం కవిత గుబులు బయలు దేరుతోంది. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం.. పార్టీలో తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తనకు అందివచ్చిన అవకాశంగా జూబ్లీహిల్స్‌ను ఆమె భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అంటే.. జూబ్లీహిల్స్‌లో తన సత్తాచాటుకునేందుకు ఆమె ప్రయత్నం చేసే అవకాశం ఉంది. తద్వారా.. ఏపీలో షర్మిల మాదిరిగా.. కవిత.. ఇక్కడ బీఆర్ఎస్‌పైనే టార్గెట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అంటే.. నేరుగా కేసీఆర్‌ను ఆమె విమర్శించకపోయినా.. పార్టీలో అవినీతి, అక్రమాలు, కాళేశ్వరం, హరీష్‌రావు, సంతోష్ రావు వంటి కీలక నాయకులను టార్గెట్ చేసుకుని.. ప్రచారం చేసే అవకాశం ఉందని.. అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓడిపోతే.. తాను ఆది నుంచి చెబుతున్న అక్రమాలు నిజమనే విషయం నిర్ధారణ అవుతుందన్న అంచనాలో కూడా కవిత ఉన్నట్టు సమాచారం.
అందుకే.. బీఆర్ఎస్ అధిష్టానం కూడా.. కవిత అడుగులపై నిఘా పెట్టినట్టు సమాచారం. తాజాగా పీజేఆర్ కుమారుడు పబ్బతి రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి కలుసుకుని చర్చించిన తర్వాత.. బీఆర్ఎస్ అధిష్టానం అలెర్టయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కవిత తన దూకుడు ద్వారా అంతర్గతంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తాజాగా ఓ అంచనాకు వచ్చారు. అందుకే.. ఆమె ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడు తున్నారనే విషయాలపై నిఘా పెట్టినట్టు సమాచారం. మరి కవితను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates