ఏపీకి సాగిల‌పడేది లేదు: రేవంత్

కృష్ణా, గోదావ‌రి జలాల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వానికి సాగిల‌పడేది లేద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. “వాళ్లు మ‌న మెత‌క‌త‌నం చూసి.. ఏవైనా క‌ట్టుకుంటారు. అన్నింటికీ.. ఒప్పుకొంటామా?” అని సంచల‌న వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావ‌రి జ‌లాల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ రాజీ ప‌డేది లేద‌ని చెప్పారు. చుక్క నీటిని కూడా వ‌దులుకునేది లేద‌ని.. రైతులు, ప్ర‌జ‌లే ఈ ప్ర‌భుత్వానికి ప్ర‌ధాన‌మ‌ని తేల్చి చెప్పారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు గురించి ప‌రోక్షంగా స్పందించిన రేవంత్ రెడ్డి.. దీనికి కేంద్రం ఎలా ఒప్పుకొంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

“4 కోట్ల మంది ప్ర‌జ‌ల గొంతులు ఎండ‌బెట్టి.. వారికి(ఏపీ) నీళ్లు ఇస్తామంటే.. చూస్తూ ఊరుకుంటామా? అస‌ర‌మైతే.. న్యాయ పోరాటం చేస్తాం.” అని రేవంత్ రెడ్డి చెప్పారు. 904 టీఎంసీల సాధనకు ట్రైబ్యునల్‌ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తామ‌న్నారు. కృష్ణా జిల్లాల్లో తెలంగాణ హ‌క్కులు ఎవ‌రో ద‌యాధ‌ర్మానికి ఇచ్చిన‌వి కాద‌న్న ఆయ‌న‌.. ఇవి తెలంగాణ ప్ర‌జ‌ల హ‌క్కుల‌ని.. వారికే ద‌క్కాల‌ని వ్యాఖ్యానించారు. న‌ల్ల‌గొండ స‌హా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో ఉన్న ఫ్లోరైడ్ స‌మ‌స్య‌ను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.

దీనిని గ‌త పాల‌కులు వినోదం చూసినట్టు చూశార‌ని ఎద్దేవా చేశారు. కానీ, త‌మ ప్ర‌భుత్వం ఖ‌ర్చుకు వెర‌వ‌కుండా.. వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని అయినా.. ‘ఎస్‌ఎల్‌బీసీ’ టన్నెల్‌ పూర్తి చేసి ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కరిస్తామ‌ని చెప్పారు. ఇక‌, హైద‌రాబాద్‌ను మ‌రో ఉత్త‌మ స్థాయి(నెక్ట్స్ లెవిల్‌)కి తీసుకువెళ్తామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. దీనిని గేట్ వే ఆఫ్ వ‌ర‌ల్డ్‌గా తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు. దీంతో పాటు.. ఫ్యూచ‌ర్ సిటీని కూడా త‌మ హ‌యాంలోనే పూర్తి చేస్తామ‌ని.. ఎప్ప‌టికీ.. తెలంగాణ ప్ర‌పంచంలో త‌లెత్తుకునేలా తీర్చిదిద్దుతామ‌న్నారు.

అభివృద్ధిపై కీల‌క వ్యాఖ్య‌లు..

  • 2047 నాటికి తెలంగాణ‌ను 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారుస్తాం.
  • హైదరాబాద్‌కు గోదావరి జలాలు తీసుకొస్తున్నాం.
  • వాయు కాలుష్యం లేని నగరంగా హైద‌రాబాద్‌ను మారుస్తున్నాం.
  • మూసీ ప‌రివాహ‌క ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా డెవ‌ల‌ప్ చేస్తాం.
  • మెట్రో విస్తరణ పనులు ప్రారంభిస్తున్నాం.
  • తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ సిద్ధం చేస్తున్నాం.
  • ఫ్యూచ‌ర్ సిటీతో రాష్ట్ర ఆదాయం పెరిగేలా చేస్తాం.