ప్రజలకు సేవ చేయడంలో దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత.. కలెక్టర్లకు కీలక పాత్ర ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్లు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తాజాగా అమరావతి సచివాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించే కలెక్టర్ల సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అభివృద్ధి, విజన్ 2047 లక్ష్యాలు సహా పీ-4, పెట్టుబడులు వంటి కీలక అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా గత ఎన్నికల ముందు.. తాము రెండు రకాలుగా ప్రజలకు హామీలు ఇచ్చామని సీఎం తెలిపారు. ఈ క్రమంలోనే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలనను ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. కష్టాలు వచ్చినా.. సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ప్రజల సంతృప్తి, సంతోషమే తమ ప్రభుత్వానికి అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో జిల్లాల కలెక్టర్లకు కూడా కీలక రోల్ ఉందన్నారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే.. విజన్ ఉన్న అధికారులు అవసరమని వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా పీ-4 ద్వారా వచ్చే నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గతంలో హార్డ్‌వర్క్ ఉండేదన్న ఆయన ప్రస్తుతం `స్మార్ట్ వర్క్` వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. భారత్‌ను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రధాని మోడీ.. రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కష్టపడుతున్నట్టు చెప్పారు.
అదే మీకు బైబిల్-ఖురాన్-భగవద్గీత!
కేంద్రం రూపొందించిన వికసిత్ భారత్ మాదిరిగానే ఏపీలోనూ స్వర్ణాంధ్ర-2047ను రూపొందించామని చంద్రబాబు చెప్పారు. జిల్లాల్లో ప్రగతి సాధిస్తేనే అది రాష్ట్రానికి చేరుతుందన్న ముఖ్యమంత్రి.. దీనికి కలెక్టర్లు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. “స్వర్ణాంధ్రప్రదేశ్-2047 అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలి.“ అని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కార్.. డబుల్ డిజిట్ గ్రోత్ లక్ష్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నామని.. దీనికి కలెక్టర్లు దోహద పడాలని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates