పీకే.. మామూలోడు కాదు.. : స‌ర్వే

పీకే.. ఎక్క‌డ ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగినా.. వినిపించే పేరు పీకే. ఈయ‌నే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్‌. గ‌త 2024 ఎన్నిక‌ల్లో కూట‌మికి ప‌రోక్షంగా స‌ల‌హాలు ఇచ్చి.. జ‌గ‌న్ ప‌రాజ‌యం పాల‌య్యేందుకు స‌హ‌క‌రించార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటారు. బీహార్ రాష్ట్రానికి చెందిన పీకే.. ఇప్పుడు త్వ‌ర‌లోనే ఆ రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క రోల్ పోషించనున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే.. జ‌న్ సురాజ్ పార్టీని పీకే స్థాపించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పాద‌యాత్ర కూడా చేశారు. ముఖ్యంగా రిజ‌ర్వేష‌న్లు, రాష్ట్రంలో అవినీతి, ఉద్యోగాల క‌ల్ప‌న వంటి కీల‌క అంశాల‌పై ఆయ‌న పోరు బాట ప‌ట్టారు.

ఇదిలావుంటే.. ఈ నెల ఆఖ‌రులో బీహార్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. దీంతో ఇక్క‌డ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఆర్డేజీ, ఎల్జీపీ, ఆప్ స‌హా వామ‌ప‌క్షాలు ఒక‌వైపు, జేడీయూ, బీజేపీ స‌హా మ‌రికొన్ని పార్టీలు ఎన్డీయేగా మ‌రోవైపు త‌ల‌ప‌డుతున్నాయి. కానీ, ఎవ‌రి ప‌క్ష‌మూ కాద‌ని.. తాను ప్ర‌జా ప‌క్షం అంటూ.. పీకే.. త‌న పార్టీని ఒంట‌రిగానే ఎన్నిక‌ల బ‌రిలోకి దింప‌నున్నారు. బీహార్ అబివృద్ధి, యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు.. పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న అందిస్తాన‌ని కూడా ఆయ‌న చెబుతున్నారు. విద్యార్థి సంఘాలు.. త‌ట‌స్థంగా ఉండే జ‌నాల్లో పీకేకు మంచి పేరుంది.

ఈ నేప‌థ్యంలో కూట‌మి పార్టీల‌.. ఓటు బ్యాంకును పీకే చీల్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీనిపై తాజాగా ఒపీనియ‌న్ పేరుతో జ‌రిగిన‌స‌ర్వేలో పీకే వ్య‌వ‌హారంపై కీల‌క విష‌యాలు వెలుగు చూశాయి. జ‌న్ సురాజ్ పార్టీకి 8.3 శాతం ఓట్లు ఖ‌చ్చితంగా ప‌డ‌తాయ‌ని ఈ స‌ర్వే తేల్చి చెప్పింది. అంటే.. ఒక ర‌కంగా.. ఏ కూట‌మి అధికారంలోకి వ‌చ్చినా.. కూడా పీకే ప్రాధాన్యం త‌గ్గ‌దు. పైగా ఆయ‌న `కింగ్ మేక‌ర్` కావ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న‌ను సర్వే స్ప‌ష్టం చేసింది. అంతేకాదు. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి రేసులో నితీష్ త‌ర్వాత ఆర్జేడీ నేత ఉండ‌గా.. ఆయ‌న త‌ర్వాత‌.. పీకే ఉన్నారు. పీకేను ముఖ్య‌మంత్రిగా కోరుకునే వారు .. 14 శాతం మంది ఉన్నార‌ని స‌ర్వే వివ‌రించింది.

అంటే.. బీహార్ ఎన్నిక‌ల్లో పీకే పాత్ర ఎలా ఉండ‌నుంద‌న్న విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అంతేకాదు.. ఏ పార్టీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చినా.. పీకే మ‌ద్ద‌తు అవ‌స‌రం అయ్యే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంద‌ని స‌ర్వే తెలిపింది. వాస్త‌వానికి కాంగ్రెస్ నేతృత్వంలో ఇక్క‌డ మ‌హాకూట‌మి ఏర్ప‌డింది. దీనికి గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. సీఎం నితీష్‌పై గ‌త ఎన్నిక‌ల్లో ఉన్నంత సానుకూల‌త‌, సానుభూతి కూడా ఇప్పుడు లేవు. ఈ నేప‌థ్యంలో మ‌హాకూట‌మి గెలుపుపై చాలా వ‌ర‌కు ఆ పార్టీ నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. ఇప్పుడ పీకే రూపంలో త‌మ ఓటు బ్యాంకు కొల్ల‌గొట్టే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ సాగుతోంది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఉన్న ప‌రిణామాలు.. ఎన్నిక‌లు ప్రారంభ‌మ‌య్యాక మారే అవ‌కాశం ఉంటుంద‌ని మ‌హాకూట‌మి నాయ‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.