నేను శివుడిని.. గరళం మింగాను: మోడీ షాకింగ్ కామెంట్స్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతానికి భిన్నంగా ఆయన వ్యాఖ్యానించారు. తనను తాను పరమశివుడితో పోల్చుకున్నారు. అంతేకాదు, శివుడి మాదిరిగా తాను కూడా గరళం మింగానని చెప్పారు. శివుడు తన కంఠంలో గరళం దాచుకున్నాడని, తాను మనసులో దాచుకున్నట్టు తెలిపారు. ఆ గరళం దేవతల కోసం శివుడు భరిస్తే, ఈ గరళం దేశ ప్రజల కోసం తాను భరిస్తున్నానని చెప్పడం మరింత సంచలనంగా మారింది. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానన్నారు.

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అస్సాంలో పర్యటించారు. ఈ ఉదయం ఆయన దరంగ్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18,530 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటిలో గువాహటి రింగ్ రోడ్డుతో పాటు నారెంగి-కురువా వంతెన నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. అదేవిధంగా దరంగ్ వైద్య కళాశాల, జీఎన్‌ఎం పాఠశాల, బీఎస్సీ నర్సింగ్ కాలేజీకి కూడా శంకుస్థాపన చేశారు.

తరువాత నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, తొలుత స్థానిక అస్సామీ భాషలో ప్రజలకు నమస్కారం తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో అస్సాం స్వరూపం సమగ్రంగా మారనుందని చెప్పారు. ముఖ్యంగా ప్రజారోగ్య రంగంలో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కనుందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి తాను అస్సాంలో పర్యటిస్తున్నానని, కామాఖ్య అమ్మవారి ఆశీర్వాదంతో ఆపరేషన్ సిందూర్ దిగ్విజయం సాధించిందని తెలిపారు.

తీవ్ర సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. “వాళ్లు నా తల్లిని దూషించారు. నన్ను దూషించారు. నన్ను వాళ్లు ఇప్పుడే కాదు, గత 20 ఏళ్లుగా దూషిస్తూనే ఉన్నారు. నానా మాటలు అంటున్నారు. అయినా భరించా. కానీ నా మాతృమూర్తిని కూడా దూషించారు. వారికీ తల్లులు ఉన్నారు, నానమ్మలు (ఇందిరమ్మ) ఉన్నారు. కానీ నా తల్లివారి తల్లి లాంటిది కాదని అన్నారు. భూపేన్ హజారికా (ప్రఖ్యాత అస్సామీ సంగీత విద్వాంసుడు)కు భారత రత్న ఇస్తే ఓర్చుకోలేకపోయారు. వారి ఓటు బ్యాంకును మోడీ కొల్లగొడతాడని, కడుపులో కత్తులు పెట్టుకుని నాపై విషం చిమ్మారు. నేను దానిని మనసులో పెట్టుకున్నా. ఇదంతా ఎవరి కోసం? మీ కోసం (దేశ ప్రజలు). ఇన్ని మాటలు పడుతున్నాను. మా అమ్మను కూడా వదలకుండా తిట్టిపోస్తున్నారు. వీరికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందో లేదో తేల్చాల్సిన అవసరం ప్రజలకు ఉంది” అని మోడీ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల బీహార్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు మోడీ తల్లిని దూషించిన విషయం తెలిసిందే.