2004లో న‌న్ను ఎవ‌రూ ఓడించ‌లేదు: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2004లో త‌న‌ను, త‌న పార్టీని ఎవ‌రో ఓడించార‌ని ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని.. కానీ, త‌న‌ను ఎవ‌రూ ఓడించ‌లేద‌ని అన్నారు. తాను రాజ‌కీయాల‌ను చూడ‌కుండా.. ప్ర‌జ‌ల సంక్షేమం, అభివృద్ధి కోసం 1999లో కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఈ క్ర‌మంలో తాను తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌ల‌ను కొంద‌రు అర్ధం చేసుకోలేక పోయార‌ని.. అదే త‌న‌ను ఓడించింద‌ని చెప్పారు. అందుకే.. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధికి రెండు వైపుల నుంచి ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు.

1995లో తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌.. తాను అనేక క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నానని చంద్ర‌బాబు తెలిపారు. ఈ క్ర‌మంలోనే పారిశ్రామికంగా.. ప‌వ‌ర్ సెక్టార్ ప‌రంగా రిఫార్మ్స్ తీసుకువ‌చ్చాన‌న్నారు. వాటిని ప్ర‌జ‌లు అర్ధం చేసుకుని.. 1999లో త‌న‌ను మ‌రోసారి గెలిపించార‌ని చెప్పారు. కానీ.. 2004కు వ‌చ్చే స‌రికి.. మాత్రం తాను ఒక‌వైపే చూశాన‌ని.. అదే త‌న‌ను ఓడించింద‌న్నారు. అంతేత‌ప్ప‌.. ఎవ‌రో వ‌చ్చి.. త‌న‌ను ఓడించార‌న్న‌ది వాస్త‌వం కాద‌ని చెప్పారు.

సంప‌ద సృష్టిస్తా..

సంప‌ద సృష్టించేందుకు కూట‌మి ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇస్తోంద‌ని.. సంప‌ద సృష్టించి.. దానిని ల‌బ్ధిదారుల‌కు పంచుతామ‌న్నారు. మ‌ళ్లీ తామే అధికారంలోకి వ‌స్తామ‌ని.. ఈ విష‌యంలో ఎలాంటి అనుమానం లేద‌న్నారు. కేంద్రంలో 11 సంవ‌త్స‌రాలుగా ఎన్డీయే ప్ర‌భుత్వం ఉంద‌ని.. వ‌చ్చే 2029 ఎన్నిక‌ల్లోనూ మ‌ళ్లీ మోడీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌ని తెలిపారు. అలాగే.. ఏపీలోనూ ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వమే ఏర్ప‌డుతుంద‌ని చెప్పారు. ఈ విష‌యంలో ఎవ‌రూ సందేహాలు వ్య‌క్తం చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ఇదిలావుంటే.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద‌యాత్ర చేసి.. చంద్ర‌బాబును గ‌ద్దె దింపార‌న్న వాద‌న త‌ర‌చుగా వినిపిస్తుంది. కానీ, అది వాస్త‌వం కాద‌ని.. త‌న‌ను ఎవ‌రూ ఓడించ‌లేద‌ని.. చంద్ర‌బాబు తాజాగా చెప్ప‌డం విశేషం. ఇక‌, భ‌విష్య‌త్తులో త‌న‌ను ఎవ‌రూ ఓడించ‌లేర‌ని.. ప్ర‌జ‌లు కూడా త‌న‌ను ఓడించ‌ర‌ని అన్నారు. ఎందుకంటే.. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ స‌మానంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. అందుకే.. త‌మ‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు.