సీమపై కూటమి స్పెషల్ ఫోకస్..!

రాయలసీమపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందా? విపక్ష వైసీపీకి బలమైన కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లోనూ పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేయాలనిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాది రెండు కీలక కార్యక్రమాలను సీమలో నిర్వహించడం ద్వారా కూటమి పార్టీలు ఈ వ్యూహాన్ని బలపరుస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అయితే చాలా పక్కా ప్లాన్‌తోనే వ్యవహరిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడును వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకా కడపలోనే పెట్టారు. అప్పట్లోనే బలమైన సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలోనూ విజయం సాధించాలని స్పష్టంగా చెప్పారు. అంటే కడప మొత్తంగా పసుపు మయం కావాలని ఆయన కోరుకున్నారు. ఇది అప్పట్లోనే వైసీపీకి డెత్ బెల్స్ మోగించిందన్న చర్చ ఉంది. ఇక ఇప్పుడు టీడీపీకి బలమైన అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమం ద్వారా మరిన్ని సంకేతాలు ఇచ్చినట్టు అయిందని అంటున్నారు.

గత ఎన్నికల్లో సీమలోని 53 అసెంబ్లీ స్థానాల్లో 49 స్థానాల్లో టీడీపీ కూటమి పార్టీలు విజయం సాధించాయి. కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. దీంతో ఇప్పుడు మరింత జోరుగా ముందుకు సాగాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ఒకవేళ వ్యతిరేకత పెరిగితే అది సీమ నుంచే ప్రారంభం అవుతుంది. గతంలోనూ ఇదే జరిగింది. టీడీపీ 2019లో ఓడినప్పుడు కేవలం మూడు స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక వైసీపీ నాలుగుకే పరిమితమైంది. అంటే సీమలోనే చైతన్యం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీకి చోటు లేకుండా సీమను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే, అధికారంలోకి రాకుండా ఆ పార్టీని అడ్డుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉంటే, ఉత్తరాంధ్రలో టీడీపీ బలంగా ఉంది. ఇలా మూడు ప్రాంతాల్లోనూ కూటమి పక్కా లెక్కలు వేసుకుని సీమపైనే ఎక్కువగా ఫోకస్ పెంచిందన్న చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై భారీ స్థాయిలో కసరత్తు చేస్తున్నారని కూడా అంటున్నారు. అయితే దీనిని వైసీపీ ఎంత మేరకు అడ్డుకుంటుందనేది చూడాలి.