మాగంటి సునీత‌కు బీఆర్ఎస్ టికెట్‌.. మారిన వ్యూహం!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల పోలింగ్‌కు ముహూర్తం స‌మీపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిపక్షం బీఆర్ఎస్ పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న మాగంటి గోపీనాథ్ కొన్నాళ్ల కింద‌ట అకాల మ‌ర‌ణం చెందిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఉప పోరులో ఆయ‌న స‌తీమ‌ణి సునీత‌కు టికెట్ ఖ‌రారు చేసింది. వాస్త‌వానికి మాగంటి కుమారుడికి తొలుత టికెట్ ఇవ్వాల‌ని భావించారు.

దీంతో మాగంటి వారసుడు వ‌స్తున్నాడ‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు కూడా సోష‌ల్ మీడియాలో కొన్నాళ్ల కింద‌టే కామెంట్లు పెట్టారు. అయితే.. మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు.. అధికార పార్టీ దూకుడును అంచ‌నా వేసిన‌.. బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌.. వ్యూహాత్మ‌కంగా త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. మాగంటి సునీత కు టికెట్ ఇవ్వ‌డం ద్వారా.. అటు సానుభూతి ఓట్లతో పాటు.. మ‌హిళా సెంటిమెంటును కూడా త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే అవ‌కాశం ఉంటుంద‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

తాజాగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి కేటీఆర్‌.. మాగంటి సునీత ను పార్టీ కీల‌క నాయ‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు. సునీతను గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. “జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్ర‌యాత్ర ప్రారంభంకావాలి. ఇక్క‌డ నుంచే.. ఇప్ప‌టి నుంచే.. మన స‌త్తా చాటిచెప్పాలి. సునీత గారిని.. భారీ మెజారిటీతో విజ‌యం సాధించేలా మ‌నం అండ‌గా ఉండాలి. ప్ర‌తి ఒక్క‌రూ క‌ద‌లి రావాలి. ఇప్పటి నుంచే ఎన్నిక‌ల ప్ర‌చారం చేయాలి” అని కేటీఆర్ సూచించారు.

ఈ సంద‌ర్భంగా.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌పైనా కేటీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓటుకు ఐదు వేల రూపాయ‌లు ఇచ్చ‌యినా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నాలు చేసే అవ‌కాశం ఉంద‌ని వ్యాఖ్యానించారు. కానీ, రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశ‌నం చేసిన పార్టీని ప్ర‌జ‌లు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం త‌ప్పుల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లి.. జూబ్లీహిల్స్‌లో సునీత విజ‌యానికి నాంది ప‌ల‌కాల‌ని నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్‌లో విజ‌యం ద్వారా.. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాల‌న‌కు గ‌ట్టి బుద్ధి చెప్పాల‌ని కేటీఆర్ సూచించారు.