కూట‌మికి స‌వాల్‌.. నిరూపించండి: జ‌గ‌న్

కూట‌మి ప్ర‌భుత్వానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌వాల్ రువ్వారు. త‌మ పాల‌న‌లో ఎక్క‌డైనా రైతులు ఇబ్బందులు ప‌డ్డారా? రైతులు ఎక్క‌డైనా ఎరువులు, పురుగు మందులు, విత్త‌నాల కోసం.. రోడ్డెక్కారా? అని ప్ర‌శ్నించారు. వీటిని ద‌మ్ముంటే నిరూపించాల‌ని ప్ర‌భుత్వానికి స‌వాల్ రువ్వారు. “అప్పుడు.. ఇప్పుడు ముఖ్య‌మంత్రి సీటు ఒక్క‌టే. అప్ప‌ట్లో ఆ సీటులో జ‌గ‌న్ ఉన్నాడు. ఇప్పుడు చంద్ర‌బాబు ఉన్నాడు. అంతే తేడా. మ‌రి రైతులకు అప్ప‌ట్లో లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వ‌స్తున్నాయి?” అని ప్ర‌శ్నించారు.

అయితే.. అప్ప‌ట్లో జ‌గ‌న్‌.. రైతుల ప‌క్ష‌పాతిగా వ్య‌వ‌హ‌రించి.. వారి మేలు కోసం ప‌నిచేశాడు.. కాబ‌ట్టే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాలేద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు ప్ర‌తి దానిలోనూ కుంభ‌కోణాలు చేస్తున్నార‌ని, అందుకే రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. ఇలా జ‌ర‌గ‌లేద‌ని నిరూపించ‌గ‌లరా? అని ప్ర‌శ్నించారు. ఏ ప్ర‌భుత్వానికైనా రైతులు ఎంత మంది ఉన్నారు..? ఎంత స్థాయిలో సాగు జ‌రుగుతోంద‌న్న లెక్కులు ఉంటాయి.. మ‌రి ఎందుకు ఇన్ని ఇబ్బందులు వ‌స్తున్నాయి ? అనిజ‌గ‌న్ నిల‌దీశారు.

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల తాలూకు వీడియోను జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శించారు. గ‌త ఏడాది క‌న్నా ఇప్పుడు 97 వేల ట‌న్నుల యూరియాను అధికంగా స‌ర‌ఫ‌రా చేశామ‌ని సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా చెప్పార‌ని.. అదే జ‌రిగి ఉంటే.. మ‌రి ఇప్పుడు ఎందుకు స‌మ‌స్య వ‌చ్చింద‌న్నారు. రైతుల‌కు ఎందుకు క‌ష్టాలు వ‌చ్చాయ‌ని నిల‌దీశారు. దీనికి ప్ర‌ధాన కార‌ణంగా రైతు భ‌రోసా కేంద్రాల‌ను, పీఏసీలను నిర్వీర్యం చేశార‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం వైపు నుంచి వ‌స్తున్న యూరియాను టీడీపీ నేత‌లు దారిమ‌ళ్లించి అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

దీనికి సంబంధించి.. క‌ర్నూలు, గుంటూరు జిల్లా దాచేప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల్లో టీడీపీ నేత‌లు అక్ర‌మంగా విక్ర‌యిస్తున్న యూరియాకు సంబంధించిన ఫొటోల‌ను ప్ర‌ద‌ర్శించారు. టీడీపీ నేత‌లే ప్ర‌భుత్వం నుంచి వ‌స్తున్న ఎరువుల‌ను దారిమ‌ళ్లించి విక్ర‌యించుకుంటున్నార‌ని అన్నారు. అలాగే.. ప్రైవేటుకు కేటాయించ‌డంతో .. వ్యాపారులు.. బ్లాక్ విక్ర‌యాలు చేప‌ట్టార‌ని తెలిపారు. ఇలా చేయ‌డం వ‌ల్లే.. రైతుల‌కు అందుబాటులో లేకుండా పోయింద‌న్నారు. దీనిలో చంద్ర‌బాబు పాత్ర నేరుగా ఉంద‌న్నారు.

దాదాపు 250 కోట్ల రూపాయ‌ల స్కాం జ‌రిగింద‌ని విమ‌ర్శించారు. దీనిని కింది నుంచి పై వ‌ర‌కు అంద‌రూ పంచుకున్నారని ఆరోపించారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఇలాంటి అక్ర‌మాలు జ‌ర‌గలేద‌ని.. ఆ రోజుల్లో త‌ప్పు చేయాలంటే.. భ‌య‌ప‌డే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చామ‌ని, అందుకే అలా జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. కానీ, ఇప్పుడు సీఎం స్వ‌యంగా జోక్యం చేసుకుని స్కాంల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు.