ఏడైనా దూకి చావొచ్చు.. చంద్ర‌బాబు:జగ‌న్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “ఏడై నా దూకి చావొచ్చు.. చంద్ర‌బాబు” అని వ్యాఖ్యానించారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర వ్యవ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుపైనా జ‌గ‌న్ ఇవే వ్యాఖ్య‌లు చేశారు. “ఇద్ద‌రూ క‌లిసి(సీఎం, మంత్రి) ఏడైనా బావుంటే చూసుకుని దూకితే స‌రిపోతుంది.” అని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఏం జ‌రిగింది?

తాజాగా బుధ‌వారం ఉద‌యం తాడేప‌ల్లిలోని నివాసంలో జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు. మంగ‌ళ‌వారం వైసీపీ త‌ర‌ఫున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించిన‌.. ‘అన్న‌దాత పోరు’ కార్య‌క్ర‌మం గురించి వివ‌రించారు. రాష్ట్రం లో రైతులు నానా అగ‌చాట్లు ప‌డుతున్నార‌ని.. ఎరువులు, పురుగు మందులు దొర‌క్క రైతులు ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో అన్న‌దాత‌ల‌కు అండ‌గా త‌మ పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మం చేప‌ట్టి న‌ట్టు చెప్పారు. అయితే. పోలీసుల‌ను పెట్టుకుని త‌మ వారికి నోటీసులు ఇచ్చార‌ని… అడ్డుకున్నార‌ని విమ‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ రైతులు.. పడుతున్న ఇబ్బందుల‌కు సంబంధించి ఫొటోల‌ను మీడియాకు చూపించారు. రైతులు పెద్ద ఎత్తున ఎరువుల విక్ర‌య కేంద్రాల వ‌ద్ద మూగ‌డం, లైన్లు.. చెప్పుల‌ను లైన్‌లో పెట్ట‌డం, రేయింబ‌వ‌ళ్లు ఎరువుల కేంద్రాల వ‌ద్ద వేచి ఉన్న ఫొటోల‌ను చూపించారు. ఈ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులోనూ రైతులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను ఆయ‌న ఫొటోల రూపంలో చూపించారు. “ఇది చూసిన త‌ర్వాత‌… ఏడైనా దూకి చావొచ్చు.. చంద్ర‌బాబు” అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

అనంతరం.. శ్రీకాకుళం జిల్లాలో రైతులు ప‌డుతున్న అవ‌స్థ‌ల‌ను కూడా ఫొటోల రూపంలో చూపించారు. “ఇది వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా. ఇక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉందో చూడండి. ఇది చూసిన త‌ర్వాత‌.. ఇద్ద‌రూ(సీఎం, మంత్రి) ఏడైనా బావింటే చూసుకుని దూకితే స‌రిపోద్ది” అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. వాస్త‌వానికి స‌మ‌స్య‌లు ఎత్తి చూప‌డం త‌ప్పుకాదు. కానీ, ఇలా చావు-బావి అంటూ.. వ్యాఖ్య‌లు చేయ‌డం ఆయ‌న‌స్థాయికి త‌గ‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.