15 నెల‌ల కూట‌మి: మెరుపులు-మ‌ర‌క‌లు ..!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఈ నెల 10వ తేదీకి 15 మాసాలు నిండుతాయి. గ‌త ఏడాది జూన్ 10వ తేదీన సీఎంగా చంద్ర‌బాబు నాలుగోసారి ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో ప్రారంభ‌మైన కూట‌మి స‌ర్కారు ఈ 15 మాసాల‌ను నిర్విఘ్నంగానే పూర్తి చేసుకుంది. అనేక మెరుపులు ఉన్నాయ‌న్న‌ది వాస్త‌వం. అయితే.. అదేస‌మ‌యంలో ప‌లు మ‌ర‌క‌లు కూడా స‌ర్కారుకు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఈ 15 మాసాల కాలాన్ని స‌మీక్షించుకుంటే.. మంచిని ప‌క్క‌న పెట్టి.. మ‌ర‌క‌ల‌పై దృష్టి పెడితే.. భ‌విష్య‌త్తులో మ‌రింత ఉన్న‌తంగా పాల‌న‌ను చేరువ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

మెరుపుల విష‌యానికి వ‌స్తే.. 1) 12 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌ను తీసుకువ‌చ్చారు. ఇది వాస్త‌వమే. అనేక కంపెనీల‌ను ఒప్పించారు. పెట్టుబ‌డులు పెట్టేలా చేస్తున్నారు. త‌ద్వారా ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు మెరుగు ప‌డేలా చేస్తున్నారు. 2) సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లు చేయ‌డం… అనేక ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ.. సూప‌ర్ సిక్స్‌లో ఇచ్చిన హామీల్లో 4 కీల‌క హామీల‌ను ప‌ట్టాలెక్కించారు. ఇది కూడా మంచి ప‌రిణామం. 3) ఈ 15 మాసాల కాలంలో కేంద్రంతోనూ మంచి స్నేహ పూరిత వాతావ‌ర‌ణాన్ని కొన‌సాగిస్తున్నారు. ఇది కూడా క‌లిసి వ‌చ్చే అంశ‌మే.

మ‌ర‌క‌లు మామూలుగాలేవు: సాధార‌ణంగా ఏ ప్ర‌భుత్వానికైనా మ‌ర‌క‌లు ప‌డ‌డం కామ‌నే. అయితే.. ప్ర‌భుత్వాధినేత‌లు చేసే త‌ప్పుల కార‌ణంగా ఆ మ‌ర‌క‌లు ప‌డితే.. వేరే లెక్క‌. కానీ, పార్టీల్లో ఉన్న నాయ‌కుల కారణంగా మ‌ర‌క‌లు ఎక్కువ‌గా ప‌డుతున్నాయి. ప్ర‌ధానంగా ఇసుక‌, మ‌ద్యం, మ‌ట్టి, పంచాయ‌తీల‌ను సీఎం చంద్ర‌బాబు అరిక‌ట్ట‌లేక పోతున్నారు. సాధార‌ణ ప్ర‌జ‌లు ఏ ప‌ని చేయించుకోవాల‌ని అన్నా.. చేతులు త‌డ‌పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీనిని అరిక‌ట్టాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ఇక నుంచి అయినా.. మార్పు తీసుకురావాలి.

మ‌రో కీల‌క విష‌యం.. రైతుల స‌మ‌స్య‌లు: ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌రకు ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న నామమాత్రంగానే ఉంది. క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన ప్ర‌చారానికి.. బ‌ల‌మైన మ‌ద్ద‌తుకు కూడా రైతులు ప్ర‌ధానంగా దోహ‌ద‌ప‌డుతున్నారు. కానీ, వారి స‌మ‌స్య‌లు మాత్రం తీర‌క‌పోగా.. మ‌రింత స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వీటిపై ఎక్కువ‌గా దృష్టి పెడితే.. వ‌చ్చే సంవ‌త్స‌రాల్లో రైతుల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. నిరుద్యోగుల అంశం తీవ్రంగానే ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేద‌న్న ఆవేద‌న కూడా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. వీటిని ప‌రిష్క‌రిస్తే.. మున్ముందు కూట‌మికి ఇబ్బందులు త‌ప్పుతాయి.