బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మంత్రి నారా లోకేశ్ కొద్ది రోజుల క్రితం భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ భేటీని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబడుతూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఆ కామెంట్లపై తాజాగా లోకేశ్ స్పందించారు. కేటీఆర్‌ను కలిసేందుకు రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా అని లోకేశ్ అడిగారు. గతంలోనూ వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ను కలిశానని గుర్తుచేశారు. అవసరమైతే కేటీఆర్‌ను మళ్లీ కలుస్తానని, ఆయనను ఎందుకు కలవకూడదని ప్రశ్నించారు.
తెలంగాణపై టీడీపీ దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ పోటీపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుదే తుది నిర్ణయమని అన్నారు. ఇక, కవితను టీడీపీలోకి తీసుకోవడం, జగన్‌ను టీడీపీలో చేర్చుకోవడంతో సమానమని అన్నారు. ఎన్డీయే బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ కు వైసీపీ ఎందుకు మద్దతిచ్చిందో జగన్‌ను వైసీపీ ఎంపీలు ప్రశ్నించాలని లోకేశ్ సూచించారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చామని, 2029 ఎన్నికల్లోనూ ప్రధాని మోదీకి మద్దతిస్తామని తేల్చి చెప్పారు.
ఇక, రెడ్‌బుక్‌లో గత ప్రభుత్వం చేసిన చాలా స్కామ్‌లు రాసి పెట్టానని, అన్నీ బయటకు వస్తాయని చెప్పారు. రెడ్ బుక్ కు భయపడే జగన్ బెంగళూరులో మకాం వేశారని ఎద్దేవా చేశారు. ఏపీ లిక్కర్ కేసులో ప్రభుత్వ జోక్యం లేదని, ఆ కేసు విచారణ పారదర్శకంగా సాగుతోందని తెలిపారు. ఫైబర్ నెట్‌ను టాటా సంస్థకు ఇచ్చే చర్చ జరగలేదని క్లారిటీనిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates