ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయి.. వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో బెయిల్‌పై ఉన్న కడప ఎంపి అవినాష్ రెడ్డి సహా.. ఇతర నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలని వివేకా కుమార్తె సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు సీబీఐని ఏం చేయమంటారు? అని ప్రశ్నించింది. అదేసమయంలో వివేకా కేసు విచారణ పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు గత విచారణలో స్పష్టం చేసింది. అయితే.. తాము అనుమానిస్తున్నవారిని సీబీఐ వదిలేసిందని వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టు కు చెప్పారు.
మొత్తంగా ఈపరిణామాల నేపథ్యంలో మంగళవారం(9-సెప్టెంబరు) సుప్రీంకోర్టు సీరియస్‌గా ఈ కేసును విచారిస్తామని గతంలోనే పేర్కొంది. దీంతో ఇంకేముంది.. ఈ కేసు మంగళవారం తేలి పోతుందని.. ఇక, సునీత కష్టాలు తీరుతాయని.. ఆవిడ ఎదురు చూపులు ఫలిస్తాయని కూడా అందరూ అనుకున్నారు. కానీ, మంగళవారం(సెప్టెంబరు 9) ఏమీ తేలలేదు. పైగా.. సీబీఐ వింత వాదన వినిపించింది. తమకు ఇంకా సమయం పడుతుందని.. ఈ కేసును విచారించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పడం గమనార్హం. అంతేకాదు.. తాము విచారించవలసిన వ్యక్తులు కూడా ఎవరూ లేరని సీబీఐ తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ రాజు తెలిపారు.
అసలు ఏం జరిగింది?
వివేకానందరెడ్డి దారుణ హత్య కేసును విచారిస్తున్న సీబీఐ తమ విచారణ పూర్తయిందని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. ఇక, విచారించాల్సిన వారు ఎవరూ లేరని కూడా పేర్కొంది. అయితే.. సుప్రీంకోర్టు కనుక ఎవరినైనా విచారించాలని ఆదేశిస్తే.. అప్పుడు విచారణ చేస్తామని తెలిపింది. ఈ క్రమంలో కౌంటర్ వేసిన వివేకా కుమార్తె సునీత.. తమకు అనేక మందిపై అనుమానం ఉందంటూ.. కొందరి పేర్లను కోర్టుకు ఇచ్చింది. ఈ వివరాలను వెల్లడించని సుప్రీంకోర్టు.. సీబీఐ అధికారుల అభిప్రాయం తీసుకుంది. ఈ క్రమంలో స్పందించిన సీబీఐ.. సెప్టెంబరు 9న తమ నిర్ణయం చెబుతామని కోర్టుకు తెలిపింది. కానీ, మంగళవారం కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. విచారణ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని పేర్కొనడం గమనార్హం.
వివేకా హత్య కేసును సీబీఐ సంపూర్ణంగా విచారణ చేసినట్టు సొలిసిటర్ జనరల్ రాజు పేర్కొన్నారు. ఇక, పునర్విచారణ అంటే.. కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎంతో సమయం, నగదు కూడా ఖర్చు చేశామని తెలిపారు. అయితే.. దీనిపై అపిడవిట్ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం తాము నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో తదుపరి విచారణ సమయానికి అఫిడవిట్ వేయనున్నట్టు రాజు తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 16కు మరోసారి కేసు విచారణ వాయిదా పడింది. ఇదిలావుంటే.. కేంద్రంలో మారుతున్న పరిణామాలు.. వైసీపీ ఎంపీలు.. గుండుగుత్తగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈ కేసు పునర్విచారణపై ప్రభావం పడుతుందన్న సంకేతాలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates